భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలంలో గణపతి నిమజ్జనాలు భక్తుల భజనలు, నృత్యాల మధ్య ఘనంగా కొనసాగాయి. చిన్ననాగారం గ్రామంలో వినాయక చవితి నుంచి భక్తులచే విశేష పూజలు అందుకున్న విఘ్నేశ్వరులను సర్వాంగ సుందరంగా అలంకరించిన రథాలపై కొలువుదీర్చి, అత్యంత భక్తిశ్రద్ధలతో శోభాయాత్ర నిర్వహించారు. ‘పోయిరా గణపయ్య.. మళ్లీ త్వరగా రావయ్యా’ అంటూ భక్తులు గణనాథుడిని ఆయా చెరువుల్లోని గంగమ్మ ఒడికి చేర్చారు.
గడివాడ గణపతికి ఘనంగా వీడ్కోలు
మండలంలోని చిన్ననాగారం గ్రామంలో గడివాడ యూత్ ఆధ్వర్యంలో భక్తులతో పూజలు అందుకున్న విఘ్నేశ్వర స్వామిని గంగమ్మ ఒడికి చేర్చేందుకు ఘనంగా నిమజ్జన శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు భక్తి పాటలకు అనుగుణంగా ఆడి పాడారు. భజనలు, సంకీర్తనలు, నృత్య ప్రదర్శనలతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు స్వామివారిని దర్శించుకుని అనుగ్రహం పొందారు.
అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో లంబోదరుడి శోభాయాత్ర
చిన్ననాగారం గ్రామంలోని అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ కమిటీ వద్ద ఏర్పాటు చేసిన లంబోదరుడి నిమజ్జన శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారి భక్తిగీతాలను ఆలపిస్తూ, ఉత్సాహంగా నృత్య ప్రదర్శనలు చేశారు. సర్పంచి సుజాత యాకయ్యతో పాటు అంబేద్కర్ యూత్ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.
కొత్తవాడ వినాయకుడి నిమజ్జనం
భక్తులచే నిత్య పూజలు అందుకున్న చిన్ననాగారం గ్రామంలోని కొత్తవాడ వినాయకుడి నిమజ్జన శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. అందంగా అలంకరించిన వాహనంపై స్వామివారిని కొలువుదీర్చి పాటలు, భజనలు, సంకీర్తనల మధ్య గంగమ్మ ఒడికి తరలించారు. ఈ సందర్భంగా గ్రామంలోని భగవత్ భక్తులు స్వామివారి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకుని పారవశ్యంతో పులకించిపోయారు. కొత్తవాడ యువకులు, భక్తులు పాల్గొన్నారు.