భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

25, సెప్టెంబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

భూ రీసర్వే పక్కాగా.. పారదర్శకంగా చేపట్టాలి: కలెక్టర్

చిన్నముప్పారంలో సర్ ప్రక్రియ కలెక్టర్ విజిట్   స్పందించని ఓటర్లను చైతన్య పరచాలి

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలం చిన్నముప్పారం గ్రామంలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ శుక్రవారం ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐఆర్‌లో భాగంగా చేపడుతున్న సవరణలు, హియరింగ్స్, రీ-సర్వే ప్రక్రియకు సంబంధించిన వివరాలను తహసీల్దార్ సుంకరి శ్రీనివాసులు, సంబంధిత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

స్పందించని ఓటర్లను చైతన్యపరచాలి

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా ఓటరు జాబితా మ్యాపింగ్, మార్పులు, చేర్పులు, కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమాలు ఎన్నికల కమిషన్ సూచనల మేరకు జిల్లాలో షెడ్యూల్ ప్రకారం కొనసాగుతున్నాయని కలెక్టర్ తెలిపారు. ఓటరు జాబితాలో పేర్ల మ్యాపింగ్ కోసం ఇప్పటికే నోటీసులు అందుకున్న వారికి హియరింగ్ నిర్వహిస్తున్నట్లు వివరించారు.

ఎన్నికల కమిషన్ సూచించిన 11 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకదాన్ని చూపించి ఓటర్లు తమ మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని తెలిపారు. ఇప్పటివరకు స్పందించని ఓటర్లను చైతన్యపరిచి, వారు మ్యాపింగ్ ప్రక్రియలో పాల్గొనే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు.

చిన్నముప్పారంలో సర్ ప్రక్రియ కలెక్టర్ విజిట్   స్పందించని ఓటర్లను చైతన్య పరచాలి

పారదర్శకంగా భూ రీసర్వే చేపట్టాలి

జిల్లాలో భూ రీసర్వే కోసం 70 గ్రామాలను ఎంపిక చేసినట్లు కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రస్తుతం రీ-సర్వే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ప్రభుత్వ భూములు, ఆబాది భూములు, పట్టా భూములను సర్వే చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పారదర్శకంగా, పక్కాగా భూ రీసర్వే నిర్వహించాలని సంబంధిత రెవెన్యూ సిబ్బందికి కలెక్టర్ సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రక్రియను నిబంధనల మేరకు పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుంకరి శ్రీనివాసులు, ఎంపీడీవో బండారి పార్థసారథి, ఎస్‌ఐఆర్ సిబ్బంది, సంబంధిత రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.