భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

25, సెప్టెంబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

చెరువు నిండింది.. రావిరాల మురిసింది

చెరువు నిండింది.."రావిరాల"మురిసింది.  పూజలు చేసిన సర్పంచి కళ్యాణి యాకాంతం

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తెగిపోయిన చెరువు కట్టకు మరమ్మతులు చేపట్టడంతో రావిరాల చెరువు మళ్లీ నిండుకుండలా మారింది. దీంతో రైతుల ముఖాల్లో చిరునవ్వులు వెల్లివిరుస్తుండగా, గ్రామ ప్రజల్లో ఆనందం వెల్లువెత్తుతోంది. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రావిరాల గ్రామంలోని చెరువు రెండేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాల సమయంలో అర్ధరాత్రి తెగిపోయింది. చెరువు కట్ట తెగిపోవడంతో రెండేళ్లుగా గ్రామంలో నీటి సమస్యలు, కరువు పరిస్థితులు నెలకొన్నాయి.

నిండుకుండలా మారిన చెరువు

వేసవి కాలంలో తెగిపోయిన చెరువు కట్టకు మరమ్మతులు చేపట్టడంతో ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులోకి భారీగా నీరు చేరింది. దీంతో చెరువు నిండుకుండలా మారి జలకళను సంతరించుకుంది. రెండేళ్ల తర్వాత చెరువు మళ్లీ నీటితో నిండటంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చెరువు నిండటంతో రైతులకు సాగునీటి భరోసా ఏర్పడటంతో పాటు గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొంది.

జల పూజలు చేసిన సర్పంచి కళ్యాణి యాకాంతం

కరువు తీరా వర్షాలు కురిసి చెరువు నిండడంతో గ్రామ సర్పంచి కత్తుల కళ్యాణి యాకాంతం, ఉపసర్పంచి తరుణ్‌, వార్డు సభ్యులు, గ్రామస్తులతో కలిసి శుక్రవారం చెరువు వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా చెరువు నీటికి జల పూజలు నిర్వహించారు. పసుపు, కుంకుమలు సమర్పించి గంగాదేవికి ప్రత్యేక పూజలు చేశారు. పాడిపంటలు సమృద్ధిగా పండి గ్రామం సుభిక్షంగా ఉండాలని గంగాదేవిని ప్రార్థించారు.

చెరువు నిండింది.."రావిరాల"మురిసింది.  పూజలు చేసిన సర్పంచి కళ్యాణి యాకాంతం

ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు

ఈ సందర్భంగా సర్పంచి కత్తుల కళ్యాణి యాకాంతం మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్ ప్రత్యేక కృషితో తెగిపోయిన చెరువు కట్టకు మరమ్మతులు చేపట్టడం జరిగిందన్నారు. దీంతో ఇటీవల కురిసిన వర్షాలకు చెరువు మళ్లీ నిండుకుండలా మారి పూర్వవైభవాన్ని సంతరించుకుందని తెలిపారు.

చెరువు నిండటంతో రైతులు, గ్రామస్తుల నీటి కష్టాలు తీరాయని సర్పంచి పేర్కొన్నారు. చెరువు పునరుద్ధరణకు కృషి చేసిన ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్‌కు గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

పెద్ద సంఖ్యలో గ్రామస్తుల పాల్గొనడం

ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు తాళ్లపల్లి సాగర్‌, ఆకుల సుప్రియకృష్ణ, గుండెపాక స్వప్న మల్లేష్‌, కడారి శ్రీకాంత్‌, కడారి వెంకటమల్లు, పబ్బ సూర్యప్రసాద్‌, కత్తుల కుమార్‌, రాస అనూష యాకిరెడ్డి, అక్కర నాగరాణి ప్రసాద్‌తో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.