భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: గాలి, వర్షానికి విద్యుత్ మెయిన్ లైన్ వైర్లు తెగి ఇంటిపై పడిన ఘటన మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం తారాసింగ్ తండా గ్రామపంచాయతీ పరిధిలోని రేకులతండాలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. ప్రమాదాన్ని గుర్తించిన తండావాసులు వెంటనే అప్రమత్తమై ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫ్యూజ్ వైర్‌ను కర్రతో కొట్టి కట్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది.
ఇంటిపై పడిన విద్యుత్ వైర్లు
రేకులతండాలోని బానోతు ఆలు ఇంటిపై నుంచి విద్యుత్ మెయిన్ లైన్ వైర్లు ఉన్నాయి. గురువారం రాత్రి గాలి, వర్షం కారణంగా వైర్లు తెగి ఒక్కసారిగా ఇంటిపై పడిపోయాయి. దీంతో సంబంధిత ఇంట్లోని కుటుంబ సభ్యులు పాక్షికంగా విద్యుత్ షాక్‌కు గురయ్యారు. వారు వెంటనే కేకలు వేయడంతో తండావాసులు అప్రమత్తమయ్యారు.
వెంటనే సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ వద్దకు పరుగున వెళ్లిన తండావాసులు విద్యుత్ సరఫరాను నిలిపివేసేందుకు ప్రయత్నించారు. అక్కడ ఫ్యూజ్ వైర్లను కర్రతో బలంగా కొట్టి కట్ చేయడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో పెను ప్రమాదం తప్పడంతో గిరిజనులు ఊపిరి పీల్చుకున్నారు.
కరెంటు అధికారులు పట్టించుకోవడం లేదు: యాకూబ్
ఇంటి మీదుగా ఉన్న విద్యుత్ మెయిన్ లైన్‌ను తొలగించాలని కరెంటు అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని తండావాసి బానోతు యాకూబ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము సకాలంలో గుర్తించి విద్యుత్ సరఫరాను నిలిపివేయకపోయి ఉంటే సంబంధిత ఇంట్లోని కుటుంబ సభ్యులు కరెంట్ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడేదని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఆఫ్ చేద్దామన్నా అక్కడ ఆన్, ఆఫ్ స్విచ్ కూడా లేదని తెలిపారు. దీంతో తామే సమయస్ఫూర్తితో కర్రతో ఫ్యూజులను కొట్టి తెంపామని చెప్పారు.
పోల్స్ ఉన్నా.. కొత్త లైన్లు ఏర్పాటు చేయలేదని ఆరోపణ
తండాకు విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కోసం అధికారులకు ఫోన్ చేసినప్పటికీ సిబ్బంది రాలేదని యాకూబ్ తెలిపారు. దీంతో తామే వైరు జాయింట్ చేసి లైన్‌ను బిగించిన తర్వాత విద్యుత్ కనెక్షన్ ఇచ్చారని పేర్కొన్నారు.
గత రెండు, మూడు నెలలుగా తండాకు విద్యుత్ పోల్స్ వచ్చి ఉన్నప్పటికీ వాటిని ఉపయోగించి కొత్త విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. గత సర్పంచులు, ప్రస్తుత పాలకమండలి కూడా ఈ సమస్యను పట్టించుకోవడం లేదని అన్నారు.
కొత్త విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలి
రేకులతండాలో నెలకొన్న విద్యుత్ సమస్యను వెంటనే పరిష్కరించాలని తండావాసులు కోరారు. ఇంటి మీదుగా వెళ్తున్న మెయిన్ విద్యుత్ లైన్‌ను తొలగించి, తండాలో కొత్త విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ వైర్ల కారణంగా గృహాలకు, ప్రజలకు ఎలాంటి హాని కలగకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని బానోతు యాకూబ్‌తో పాటు తండావాసులు ప్రభుత్వాన్ని కోరారు.