భారత్ సమాచార్, మెదక్ జిల్లా: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చిట్యాల చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా మెదక్ జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ చిత్రపటానికి మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఐపీఎస్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అణచివేతను ఎదురించి పోరాడిన ఐలమ్మ
ఈ సందర్భంగా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ సామాజిక అన్యాయాన్ని, అణచివేతను ఎదురిస్తూ ఆత్మగౌరవం, హక్కుల కోసం చాకలి ఐలమ్మ ధైర్యంగా పోరాడారని గుర్తుచేశారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ వెనుకడుగు వేయకుండా ఆమె చూపిన తెగువ, పోరాట స్ఫూర్తి తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. చాకలి ఐలమ్మ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
సమానత్వం కోసం కృషి చేయాలి
సమాజంలో సమానత్వం, న్యాయం, ఆత్మగౌరవం, మహిళల గౌరవం, సాధికారత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్పీ సూచించారు. యువత చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని సామాజిక బాధ్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు సందీప్ రెడ్డి, శైలందర్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొని చాకలి ఐలమ్మకు ఘనంగా నివాళులర్పించారు.