భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనపై సేవా హి సంకల్ప్ అభియాన్‌లో భాగంగా ఇనుగుర్తి మండల కేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో శనివారం బీజేపీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షులు దుంపల సందీప్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాఠశాల ఆవరణలో విద్యార్థులతో పాటు నాయకులు పాల్గొన్నారు.
విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు
జడ్పీహెచ్‌ఎస్‌లో స్థానిక హెచ్‌ఎం అమ్మ యాకయ్య అధ్యక్షతన విద్యార్థులకు ‘ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల పాలన’ అనే అంశంపై చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోతు మదన్ లాల్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో దేశభక్తి, సేవా భావం, స్వచ్ఛ భారత్, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకే చిత్రలేఖన పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. విద్యార్థులు తమ సృజనాత్మకతతో అద్భుతమైన చిత్రాలను గీసి ప్రతిభను చాటుకున్నారని కొనియాడారు. అనంతరం పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
పాఠశాల పరిసరాల్లో స్వచ్ఛత కార్యక్రమం
అంతకుముందు స్వచ్ఛ భారత్‌లో భాగంగా బీజేపీ నాయకులు పాఠశాల ఆవరణలోని పిచ్చి మొక్కలు, చెత్తను తొలగించి పరిసరాలను పరిశుభ్రం చేశారు. పరిశుభ్రత కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి ఒక్కరి బాధ్యత అని చాటిచెప్పేందుకు మోదీ 2014లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని నాయకులు పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రస్తుతం ఉద్యమంలా కొనసాగుతోందన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు కాలేరు నేతాజీ, డా. వెంకటేశ్వర్లు, గాయపు సురేందర్ రెడ్డి, పరిపాటి నరసయ్య, మునిగంటి యాకయ్యతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.