భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

26, సెప్టెంబర్ 2026, శనివారంభారత్ సమాచార్

సామాజిక న్యాయం, రాజ్యాధికారంపై వరంగల్‌లో మహాసభ

సామాజిక న్యాయం రాజ్యాధికారం  వరంగల్ పట్టణంలో భారీ బహిరంగ సభ

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ధర్మ సమాజ్ పార్టీ మద్దతుతో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో ‘సామాజిక న్యాయం – రాజ్యాధికారం’ అంశంపై సెప్టెంబర్ 27న ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. వరంగల్‌లోని హంటర్ రోడ్ డి-కన్వెన్షన్ హాల్‌లో ఈ మహాసభను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

విశ్వబ్రాహ్మణుల సమస్యలపై డిమాండ్లు

ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం కోశాధికారి మోత్కూరు శంకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణులు వృత్తిపరంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని పేర్కొన్నారు. కార్పొరేట్ జ్యువెలరీ షాపుల కారణంగా స్వర్ణకారులకు ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయని తెలిపారు.

విశ్వబ్రాహ్మణులు సున్నితమైన వృత్తులు చేస్తూ 50 సంవత్సరాలకే కంటి చూపు సమస్యలను ఎదుర్కొంటున్నారని అన్నారు. 50 సంవత్సరాలు దాటిన విశ్వబ్రాహ్మణ (పంచదాయిల) సోదరులకు నెలకు రూ.5 వేల పెన్షన్‌తో పాటు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ప్రభుత్వాలు మారినా సమస్యలు పరిష్కారం కాలేదని వ్యాఖ్య

ఈ డిమాండ్లను గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలం నుంచి ప్రభుత్వాల దృష్టికి తీసుకువస్తున్నామని శంకర్ తెలిపారు. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ తమ సమస్యలకు తగిన పరిష్కారం లభించడం లేదని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో వివిధ రాజకీయ పార్టీలు హామీలు ఇస్తున్నప్పటికీ, అధికారంలోకి వచ్చిన తర్వాత తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరిస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు. సెప్టెంబర్ 27న జరగనున్న మహాసభకు మహబూబాబాద్ జిల్లాలోని ప్రతి గ్రామం నుంచి విశ్వబ్రాహ్మణ సోదర, సోదరీమణులు సకాలంలో హాజరై అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శంకర్ కోరారు.