భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: జిల్లాస్థాయి ఉపన్యాస పోటీల్లో మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలానికి చెందిన పీఎం శ్రీ మోడల్ స్కూల్ విద్యార్థి నూతన్ సాయి ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయిలో తృతీయ స్థానాన్ని సాధించాడు. శనివారం కలెక్టర్ స్నేహ శబరిష్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం, జ్ఞాపికను అందుకున్నాడు.
ప్రతిభకు గుర్తింపుగా ప్రశంసా పత్రం
ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని కంబాలపల్లిలో విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఉపన్యాస పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పీఎం శ్రీ తెలంగాణ రాష్ట్ర ఆదర్శ పాఠశాల అండ్ జూనియర్ కళాశాల, నెల్లికుదురుకు చెందిన నూతన్ సాయి పాల్గొని తన ప్రతిభను చాటుకున్నాడు.
గైడ్ టీచర్ ఎం.ఏ. అంజుమ్ సుల్తానా మార్గదర్శకత్వంలో నూతన్ సాయి ఈ ఘనత సాధించాడు. జిల్లా స్థాయిలో తృతీయ స్థానం సాధించిన సందర్భంగా కలెక్టర్ స్నేహ శబరిష్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం, జ్ఞాపిక అందుకోవడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
విద్యార్థికి అభినందనలు
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ జి. ఉపేందర్ రావు విద్యార్థి నూతన్ సాయిని, గైడ్ టీచర్ ఎం.ఏ. అంజుమ్ సుల్తానాను అభినందించారు. విద్యార్థులు చదువుతో పాటు వివిధ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులతో పాటు మండల ప్రజలు నూతన్ సాయికి శుభాకాంక్షలు తెలిపారు.