భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన ఉపసర్పంచి సత్తుత్తూరి యాదగిరి బీఆర్ఎస్లో చేరడంపై కాంగ్రెస్ మండల శాఖ నాయకులు స్పందించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు బైరు అశోక్ గౌడ్, మాజీ మండల పార్టీ అధ్యక్షులు కూరెళ్లి సతీష్, దిశ కమిటీ సభ్యులు గుజ్జునూరి బాబురావు, వార్డు సభ్యులు నద్దునూరి ప్రశాంత్ మాట్లాడారు.
పదవికి రాజీనామా చేయాలని సూచన
ఉపసర్పంచి సత్తుత్తూరి యాదగిరి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి వెళ్లడం దురదృష్టకరమని వారు పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన పదవికి, వార్డు ప్రజల విశ్వాసానికి గౌరవం ఇచ్చి ఉపసర్పంచి పదవికి రాజీనామా చేయాలని సూచించారు. అనంతరం తిరిగి వార్డు సభ్యుడిగా పోటీ చేసి గెలిచి తన విశ్వసనీయతను నిరూపించుకోవాలని అన్నారు.
కాంగ్రెస్కు నష్టం లేదని వ్యాఖ్య
ఒక వ్యక్తి పార్టీని వీడినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం జరగదని నాయకులు పేర్కొన్నారు. ఇనుగుర్తితో పాటు మండలంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని తెలిపారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు మండల పార్టీతో పాటు స్థానిక నాయకత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ కొట్టం రాము, వార్డు సభ్యులు శ్రీకాంత్, బూర ఇస్తారి, సీనియర్ నాయకులు ఇస్లావత్ చందు, మామిడి జనార్ధన్, కుంచాల రమేష్, కొణతం రాములు, మహంకాళి సలీం, సురేష్, కొలిపాక నారాయణ, కొణతం ప్రభాకర్, నాగేల్లి సుధీర్ తదితరులు పాల్గొన్నారు.