భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

26, సెప్టెంబర్ 2026, శనివారంభారత్ సమాచార్

నీట్‌లో సత్తా చాటి ఎంబీబీఎస్ సీటు

ఎంబిబిఎస్ విద్యార్థి సండ్రా నెత్తినకు గ్రామ పెద్దల ఆర్థిక సహాయం

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నిరుపేద కుటుంబం నుంచి వచ్చి నీట్‌లో ప్రతిభ కనబరిచి ఎంబీబీఎస్ సీటు సాధించిన ఫత్తేపురం గ్రామానికి చెందిన సండ్ర నితిన్‌ను గ్రామ పెద్దలు ఘనంగా సత్కరించి ఆర్థిక సహాయం అందించారు. నితిన్ నీట్‌లో 485 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 1655వ ర్యాంకు పొందడంతో సూర్యాపేట మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు లభించింది.

ఆర్థికంగా అండగా నిలిచిన గ్రామ పెద్దలు

నితిన్ సాధించిన విజయాన్ని అభినందిస్తూ గ్రామ సర్పంచ్ ఇట్టే మాధవ రెడ్డి ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ హెడ్మాస్టర్, విశ్రాంత ఉద్యోగుల సంఘం తొర్రూరు మండల అధ్యక్షుడు ఇట్టె సోమిరెడ్డి రూ.5,000, రిటైర్డ్ కండక్టర్ భవిరిశెట్టి సోమయ్య రూ.3,000, గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇట్టే మహేందర్ రెడ్డి రూ.3,000 ఆర్థిక సహాయం అందించి నితిన్‌కు అండగా నిలిచారు.

పేద విద్యార్థులను ప్రోత్సహించాలి

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాధవరెడ్డి, విశ్రాంత ఉద్యోగుల సంఘం తొర్రూరు మండల అధ్యక్షుడు ఇట్టె సోమిరెడ్డి మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబాల్లో జన్మించి ప్రతిభ కనబరిచే పేద విద్యార్థులను ప్రోత్సహించాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు. గ్రామం నుంచి ఎంబీబీఎస్ సీటు సాధించడం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. నితిన్ భవిష్యత్‌లో విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తూ, పేద ప్రజలకు ఉత్తమమైన వైద్య సేవలు అందించాలని సూచించారు.

గ్రామ పెద్దలు అందించిన ఆర్థిక సహాయం తన వైద్య విద్యకు ఎంతో ఉపయోగపడుతుందని నితిన్ పేర్కొంటూ వారికి కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో రిటైర్డ్ ఉపాధ్యాయులు ఇట్టే సోమిరెడ్డి, ఉపసర్పంచ్ కొండ సతీష్, వార్డు సభ్యులు ఎడ్ల పద్మ వెంకన్న, పల్లె సాయిలు, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు.