భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

26, సెప్టెంబర్ 2026, శనివారంభారత్ సమాచార్

చిన్నముప్పారంలో భూ రీసర్వేపై గ్రామసభ

చిన్నముప్పారంలో భూ రీసర్వేపై గ్రామసభ

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి కార్యక్రమంలో భాగంగా భూముల రీ-సర్వేపై మండలంలోని చిన్నముప్పారం గ్రామంలో శనివారం గ్రామసభ, రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచి రాయలి భవాని శేఖర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్థానిక తహసిల్దార్ సుంకరి శ్రీనివాసులు, ఏడీఏస్ఆర్ఎల్ శ్రీనివాసులు, సర్వేయర్ మురళి తదితరులు హాజరయ్యారు.

అధికారులకు సహకరించాలి

ఈ సందర్భంగా తహసిల్దార్ సుంకరి శ్రీనివాసులు, ఏడీఏస్ఆర్ఎల్ శ్రీనివాసులు మాట్లాడుతూ.. భూముల రీ-సర్వే ప్రక్రియలో రైతులు సంబంధిత అధికారులకు తమ భూములకు సంబంధించిన వివరాలన్నీ తెలియజేస్తూ సహకరించాలని సూచించారు. రీ-సర్వే ఉద్దేశ్యం, భూముల సర్వే ప్రక్రియ, భూ హద్దుల నిర్ధారణ, భూ రికార్డుల నవీకరణ తదితర అంశాలపై రైతులకు, గ్రామ ప్రజలకు అధికారులు అవగాహన కల్పించారు.

భూ రికార్డులపై అవగాహన

రీ-సర్వే ప్రక్రియలో రైతులు తమ భూములకు సంబంధించిన వివరాలను పరిశీలించుకోవాలని, సర్వే సిబ్బందికి అవసరమైన సహకారం అందించాలని తహసిల్దార్ సూచించారు. భూ హక్కులు, భూ రికార్డులకు సంబంధించిన వివరాల విషయంలో రైతులు ఎలాంటి అపోహలకు లోనుకాకుండా, అధికారుల సూచనలను పాటిస్తూ రీ-సర్వే ప్రక్రియలో భాగస్వాములు కావాలని అధికారులు కోరారు.

కార్యక్రమంలో ఆర్‌ఐ మున్వర్, సర్వే సిబ్బంది, గ్రామ పరిపాలన అధికారులు, రైతులు పాల్గొన్నారు.