భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలం ఆలేరు హైస్కూల్లో 1985–86 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఆదివారం నర్సింహులగూడెంలోని శ్రీ కోరగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆవరణలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమ బిజీ జీవితాలను పక్కన పెట్టి ఒకచోట చేరి, తాము విద్యాభ్యాసం చేసిన ఆలేరు హైస్కూల్ నాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత కలుసుకున్న వారు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. ప్రస్తుతం ఎక్కడ నివసిస్తున్నారు? ఏం చేస్తున్నారు? పిల్లలు ఎలా చదువుతున్నారు? ఉద్యోగాలు చేస్తున్నారా? కుటుంబ, ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి? అంటూ కుశల ప్రశ్నలు వేసుకుంటూ ఆనందంగా గడిపారు.
గురువులకు ఘన సన్మానం
తమకు విద్యాబుద్ధులతో పాటు జీవితంలో ఎన్నో విలువైన పాఠాలు నేర్పిన నాటి గురువులను పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. గురువులు ఘట్టం లక్ష్మీనరసయ్య, రమేష్ రెడ్డి, మోహన్ రావు, రాజమౌళి, సంజీవరెడ్డిలను సత్కరించి, పాద నమస్కారం చేసి తమ కృతజ్ఞతను చాటుకున్నారు.
ఆటపాటలతో సందడి
అనంతరం పూర్వ విద్యార్థులు ఉత్సాహభరితంగా ఆటపాటల్లో పాల్గొని సందడి చేశారు. చిన్ననాటి స్నేహితులతో కలిసి సరదాగా గడిపి పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అనంతరం అందరూ కలిసి సామూహిక విందులో పాల్గొని ఆత్మీయతను చాటుకున్నారు.
కార్యక్రమంలో నర్సింహులగూడెంకు చెందిన ప్రజా వైద్యులు ఆర్ఎంపీ డాక్టర్ చలమల్ల వెంకటేశ్వర్లు, వివిధ గ్రామాలకు చెందిన నాటి విద్యార్థులు తాడూరు బాలకిషన్, కాలేరు లక్ష్మీనారాయణ, డాక్టర్ కాలేరు సత్యనారాయణ, కానిస్టేబుల్ నిరంజన్, నరేందర్, రాములు, శంకరయ్య, వెంకన్న, శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మీపురం సర్పంచ్ ప్రేమలీల, శ్రీదేవి, కట్టయ్య, రమాదేవి, పి.వినోద్‌తో పాటు పలువురు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.