భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

28, సెప్టెంబర్ 2026, సోమవారంభారత్ సమాచార్

నశా ముక్త్ యువతతోనే వికసిత్ భారత్

నశా ముక్త్ యువతతోనే వికసిత్ భారత్..                  మండల వైద్యాధికారి డా.రమ్య

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన, బాధ్యతాయుతమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని నెల్లికుదురు మండల వైద్యాధికారి డా. రమ్య పిలుపునిచ్చారు. “నశా ముక్త్ యువ – వికసిత్ భారత్” కార్యక్రమంలో భాగంగా సోమవారం నెల్లికుదురు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ కె. వీరస్వామి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి డా. రమ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు కుటుంబం, సమాజం, ఆర్థిక పరిస్థితులపై కూడా తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని వివరించారు.

డా. రమ్య మాట్లాడుతూ యువత మత్తు పదార్థాల వ్యసనానికి లోనుకాకుండా తమ భవిష్యత్తుపై దృష్టి సారించాలని సూచించారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తూ విద్య, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాల్లో ముందుకు సాగాలని కోరారు. దేశ అభివృద్ధిలో యువత పాత్ర ఎంతో కీలకమని, మత్తు రహిత యువతతోనే బలమైన మానవ వనరులను నిర్మించగలమని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి మత్తు పదార్థాలకు దూరంగా ఉండటంతో పాటు తన స్నేహితులు, పరిసరాల్లోని యువతకు కూడా అవగాహన కల్పించాలని సూచించారు.

కళాశాల ప్రిన్సిపాల్ కె. వీరస్వామి మాట్లాడుతూ యువత తమ శక్తి, ప్రతిభను విద్య, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి, పరిశోధన, సృజనాత్మకత, సామాజిక సేవ వంటి నిర్మాణాత్మక కార్యక్రమాల వైపు మళ్లించాలని అన్నారు. మత్తు రహిత యువతే దేశానికి బలమైన మానవ వనరుగా నిలుస్తుందని తెలిపారు. యువత మత్తు వ్యసనాలకు దూరంగా ఉండేందుకు ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు గ్రామాలు, విద్యాసంస్థల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.

ఈ సందర్భంగా విద్యార్థులతో మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. నశా ముక్త్ భారత్ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ మర్సకట్ల అనిల్ కుమార్, పెద్దూరి వెంకటేశ్వర్లు, అధ్యాపకులు సుధాకర్, యాకన్న, రామ్మూర్తి, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.