భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన ప్రముఖ వాలీబాల్ క్రీడా ప్రోత్సాహకుడు, స్వర్గీయ కందునూరి కొమురయ్య సార్ 14వ వర్ధంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఇనుగుర్తి పెద్ద బస్టాండ్ సెంటర్లోని కొమురయ్య సార్ విగ్రహానికి పలువురు క్రీడాకారులు, గ్రామస్తులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు. వాలీబాల్ క్రీడను ఇనుగుర్తి ప్రాంతానికి పరిచయం చేయడంతో పాటు అప్పటి హైస్కూల్ విద్యార్థులను క్రీడల వైపు ప్రోత్సహించి, వారికి శిక్షణ అందించిన తీరును గుర్తుచేసుకున్నారు.
కొమురయ్య సార్ అందించిన ప్రోత్సాహంతో ఎంతోమంది విద్యార్థులు వాలీబాల్ క్రీడలో రాణించి ఉన్నత స్థాయికి చేరుకున్నారని క్రీడాకారులు తెలిపారు. ఆయన శిక్షణ, మార్గదర్శకత్వంతో పలువురు క్రీడాకారులు ఉద్యోగాలు సైతం సంపాదించుకున్నారని గుర్తుచేశారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించడంలో కొమురయ్య సార్ చేసిన కృషి ప్రత్యేకమైందని పేర్కొన్నారు. ఆయన సేవలను భవిష్యత్ తరాలకు కూడా పరిచయం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
కొమురయ్య సార్ వర్ధంతి సందర్భంగా మానుకోట మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ కూడా విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాలీబాల్ క్రీడకు కొమురయ్య సార్ అందించిన ప్రోత్సాహం, క్రీడాకారులకు ఇచ్చిన శిక్షణ మరువలేనిదని అన్నారు. ఇనుగుర్తి ప్రాంతం నుంచి క్రీడాకారులను తీర్చిదిద్దడంతో పాటు వాలీబాల్‌కు ప్రాచుర్యం కల్పించేందుకు ఆయన చేసిన కృషి అభినందనీయమని పేర్కొన్నారు. ఆయన సేవల ఫలితంగా పలువురు క్రీడాకారులు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారని తెలిపారు.
కార్యక్రమంలో బొబ్బిలి మల్లారెడ్డి, క్రీడా కోచ్ సట్ల భిక్షం, రిటైర్డ్ టీచర్ కన్న సాంబయ్య, శీలం రాజిరెడ్డి, పరుపాటి మైబూబ్ రెడ్డి, రవీంద్రాచారి, కందునూరి వెంకన్న, వద్దిరాజు పెద్ద వెంకన్న, కందునూరి చిన వెంకన్న, తాళ్లపెల్లి సతీష్, కందునూరి శ్రీరాములు, బొబ్బిలి వెంకట్ రెడ్డి, శీలం మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే వెంట దార్ల రామ్మూర్తి, పింగిలి శ్రీనివాస్, గండు నాగయ్య గౌడ్, బూర రజినీకాంత్ తదితరులు పాల్గొని కొమురయ్య సార్‌కు నివాళులర్పించారు.