భారత్ సమాచార్, మెదక్ జిల్లా: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మెదక్ జిల్లాలోని రామాయంపేటను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించినప్పటికీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దానిని అమలు చేయడం లేదని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. రామాయంపేట రెవెన్యూ డివిజన్‌ను తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆమె ఆధ్వర్యంలో రామాయంపేటలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో రామాయంపేటను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించారని, అయితే ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటివరకు దానిని అమలు చేయకపోవడం పట్ల ప్రజల్లో అసంతృప్తి నెలకొంటోందన్నారు. రామాయంపేట రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో ఈ ప్రాంత ప్రజలకు పరిపాలనా సేవలు మరింత చేరువ అవుతాయని తెలిపారు. ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకుని రెవెన్యూ డివిజన్‌ను అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
దసరా తర్వాత ఉద్యమం ఉధృతం
రామాయంపేట రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, లేకుంటే దసరా తర్వాత ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని పద్మాదేవేందర్ రెడ్డి హెచ్చరించారు. ఈ ఉద్యమంలో కుల సంఘాలు, విద్యార్థులు, ప్రజా నాయకులు, మహిళా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలను కలుపుకుని ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. రామాయంపేట రెవెన్యూ డివిజన్ సాధించే వరకు పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు.
ముఖ్య నాయకుల పాల్గొనడం
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ బాదే చంద్రం, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, సుప్రభాత రావు, ఉమామహేశ్వర్, శ్రీకాంత్ సాగర్, అస్నుద్దీన్, దోమకొండ శ్రీను, గణపురం కృష్ణగౌడ్, రొయ్యల నవీన్, మధ్యల రమేష్, కృష్ణగౌడ్‌తో పాటు టీఆర్ఎస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.