భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: గ్రామ ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు సర్పంచి చెడుపాక సుజాత యాకయ్య తెలిపారు. ఇనుగుర్తి మండలం చిన్ననాగారం గ్రామంలో సేవ్ యువర్ లివర్ ఫౌండేషన్ డా. జంగాల రాజేశ్వరరావు, సాయిరాం హాస్పిటల్స్ డా. జంగాల స్వాతి సహకారంతో, స్థానిక సర్పంచి సుజాత యాకయ్య అభ్యర్థన మేరకు మంగళవారం ఉచిత వైద్య శిబిరం, మందుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ వైద్య శిబిరాన్ని సర్పంచి సుజాత యాకయ్య, ఎంపీడీవో పార్థసారథి, వార్డు సభ్యులు తదితరులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచి మాట్లాడుతూ.. గ్రామంలో వివిధ రుగ్మతలతో ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు ఖమ్మం నుంచి వైద్య నిపుణులను తీసుకువచ్చి ఉచితంగా వైద్య సేవలు అందించడం పట్ల సేవ్ యువర్ లివర్ ఫౌండేషన్, సాయిరాం హాస్పిటల్స్ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.
సేవలు అభినందనీయం: ఎంపీడీవో
పేదల ఆరోగ్య పరిరక్షణ కోసం జంగాల రాజేశ్వరరావు ఆధ్వర్యంలోని సేవ్ యువర్ లివర్ ఫౌండేషన్, సాయిరాం హాస్పిటల్స్ ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ చేస్తున్న సేవలు అభినందనీయమని ఎంపీడీవో పార్థసారథి కొనియాడారు. ఖమ్మం నుంచి సుమారు 25 మంది వైద్యులు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు గ్రామానికి వచ్చి పేదలకు వైద్య సేవలు అందించడం ఆదర్శనీయమన్నారు.
177 మందికి వైద్య సేవలు
వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 177 మందికి పైగా వైద్య సేవలు అందించినట్లు సేవ్ యువర్ లివర్ ఫౌండేషన్ డైరెక్టర్ గెడ్డం సామ్యూల్ తెలిపారు. వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేసినట్లు చెప్పారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో డా. ప్రశాంతి, డా. పవన్‌తో పాటు నర్సులు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు సేవలు అందించినట్లు సామ్యూల్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచి బైరు చిన్న బాలయ్య, వార్డు సభ్యులు నిడిగంటి చంద్రమౌళి, మునిగంటి సరిత రాజు, చెడుపాక అలివేలు వెంకన్న, బైరు నాగన్న, కొయ్యడి యాదగిరి, బత్తిని రాములు గౌడ్, పెదగోని వెంకటయ్య, బైరు యాకయ్య తదితరులు పాల్గొన్నారు.