భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

29, సెప్టెంబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

వావిలాల సెక్టార్‌లో ఘనంగా పోషణ మాసోత్సవం

వావిలాల సెక్టార్లో ఘనంగా పోషణ మాసోత్సవం

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మండలంలోని వావిలాల సెక్టార్ ఐసీడీఎస్ అంగన్వాడీ కేంద్రాల టీచర్ల ఆధ్వర్యంలో కాస్య తండా శివారులోని సంధ్య తండాలో మంగళవారం పోషణ మాసోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ బోడ నర్సింహ నాయక్, తొర్రూరు ప్రాజెక్టు ఏసీడీపీఓ విజయలక్ష్మి, సూపర్‌వైజర్ నీరజ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా శ్రీమంతాలు, అన్నప్రాసన కార్యక్రమాలను నిర్వహించారు. అంగన్వాడీ టీచర్లు ఏర్పాటు చేసిన పోషకాహారానికి సంబంధించిన చార్టుల ప్రదర్శనలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలకు పోషకాహారం ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు.

పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం: సర్పంచ్

సర్పంచ్ బోడ నర్సింహ నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం సరఫరా చేసే పోషకాహారంతో పాటు పాలు, కూరగాయలు, పండ్లు తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం అందించే ఆహారాన్ని లబ్ధిదారులకు ఎప్పటికప్పుడు పంపిణీ చేస్తూ, వారు సద్వినియోగం చేసుకునేలా చూడాలని అధికారులు, అంగన్వాడీ టీచర్లకు సూచించారు.

వావిలాల సెక్టార్లో ఘనంగా పోషణ మాసోత్సవం

సమతుల్య ఆహారం తీసుకోవాలి: ఏసీడీపీఓ

ఏసీడీపీఓ విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, మినరల్స్, పీచు పదార్థాలతో కూడిన ఆహారాన్ని ప్రతిరోజూ తీసుకుంటూ సమతుల్యత పాటించాలని సూచించారు. రక్తహీనత సమస్య దరిచేరకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

బెల్లం నువ్వుల ఉండలు, పాలు, గుడ్లు, బీట్‌రూట్, మునగాకు, పల్లి పట్టీలు వంటి ఐరన్ సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలని బాలింతలు, గర్భిణీలు, కిశోర బాలికలకు వివరించారు. అనంతరం పోషకాహారంపై అవగాహన కల్పిస్తూ ప్రతిజ్ఞ చేయించారు.

కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మహేష్, వార్డు సభ్యులు, సెక్టార్ పరిధిలోని అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలు పాల్గొన్నారు.