భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయం సెంటర్‌లో ఉన్న జామా మసీదు ఏ మహబూబియా మర్కజీ మసీదు నూతన కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని మసీదు కిరాయిదారులు, బాధ్యులు డిమాండ్ చేశారు. మసీదు కమిటీ గడువు పూర్తయినప్పటికీ మాజీ అధ్యక్షుడు ఇస్మాయిల్ నాయక్ అనధికారికంగా అధ్యక్షుడిగా చలామణి అవుతూ కిరాయిదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లో జేసీ అనిల్ కుమార్‌ను కలిసి తమ సమస్యలను వివరించారు.
కిరాయిల వసూళ్లపై ఫిర్యాదు
2014 నుంచి 2026 సెప్టెంబర్ వరకు మసీదు కమిటీల్లో ఇస్మాయిల్ నాయక్ ఏదో ఒక బాధ్యతలో కొనసాగుతూ, కిరాయిదారులపై ఒత్తిడి చేస్తూ, వక్ఫ్ బోర్డు ఆదేశాలకు విరుద్ధంగా కిరాయిలను పెంచుతున్నారని కిరాయిదారులు ఆరోపించారు. తమను ఇబ్బందులకు గురిచేస్తున్న ఇస్మాయిల్ నాయక్‌పై చర్యలు తీసుకోవాలని వారు జేసీని కోరారు.
మసీదు కమిటీ గడువు పూర్తయిన తర్వాత కూడా తానే అధ్యక్షుడినంటూ కిరాయిదారుల నుంచి కిరాయిలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. నూతన కమిటీ ఏర్పాటు చేసే వరకు కిరాయిలను ఇస్మాయిల్ నాయక్‌కు లేదా ఇతరులకు చెల్లించకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
కిరాయిలు ఇతరులకు ఇవ్వొద్దు: జేసీ
కిరాయిదారుల ఫిర్యాదుపై జేసీ అనిల్ కుమార్ స్పందిస్తూ.. నూతన కమిటీ ఏర్పడే వరకు మసీదు కిరాయిదారుల నుంచి ఎలాంటి కిరాయిలను ఇస్మాయిల్ నాయక్‌కు గానీ, ఇతరులకు గానీ ఇవ్వకుండా చూడాలని వక్ఫ్ బోర్డు ఇన్‌స్పెక్టర్ నజీముద్దీన్‌కు సూచించినట్లు కిరాయిదారులు తెలిపారు. అవసరమైతే కిరాయిదారుల నుంచి కిరాయిలను స్వయంగా వక్ఫ్ బోర్డుకు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు చెప్పారు.
కమిటీ వ్యవహారాలపై ఆరోపణలు
కిరాయిదారులు తెలిపిన వివరాల ప్రకారం.. 2014లో ఏర్పడిన మసీదు కమిటీలో ఇస్మాయిల్ నాయక్‌కు ట్రెజరర్‌గా బాధ్యతలు అప్పగించారు. అయితే కమిటీ గడువు పూర్తికాకముందే ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, లెక్కపత్రాలు అప్పగించకుండా మసీదు, కమిటీ బాధ్యతల నుంచి తప్పుకున్నారని వారు ఆరోపించారు.
అనంతరం అదే కమిటీలో బాధ్యతలు నిర్వహిస్తున్న గౌస్ కార్పెంటర్ లాక్‌డౌన్ సమయంలో కూడా తన సొంత ఖర్చులతో మౌజన్, ఇమామ్, మసీదులో పనిచేసే సిబ్బందికి ప్రతినెలా జీతాలు చెల్లిస్తూ మసీదు నిర్వహణకు సహకరించారని తెలిపారు.
2022లో అధ్యక్ష బాధ్యతలు
2022 నవంబర్‌లో నూతన కమిటీ ఏర్పాటు సమయంలో ఇస్మాయిల్ నాయక్‌కు గతంలో ట్రెజరర్‌గా బాధ్యతలు సక్రమంగా నిర్వహించలేదనే కారణంతో అధ్యక్ష పదవికి అనర్హత ఉన్నట్లు వక్ఫ్ బోర్డు అధికారులు తెలిపినప్పటికీ, తనకు అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే సక్రమంగా నిర్వహిస్తానని, గత కమిటీలో పెండింగ్‌లో ఉన్న లెక్కలన్నింటినీ చూపిస్తానని నోటరీ ద్వారా హామీ ఇచ్చిన అనంతరం అధ్యక్ష బాధ్యతలు అప్పగించినట్లు కిరాయిదారులు తెలిపారు.
అయితే అనంతరం కమిటీ నిర్వహణలో ఇస్మాయిల్ నాయక్ విఫలమయ్యారని వారు ఆరోపించారు. కమిటీలోని ఇతర బాధ్యులకు సమాచారం ఇవ్వకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ కమిటీని నిర్వహించారని పేర్కొన్నారు. 2022 నవంబర్‌లోనే కమిటీ గడువు పూర్తయినప్పటికీ, అప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు నాలుగు సంవత్సరాలుగా తానే అధ్యక్షుడినంటూ కొనసాగుతున్నారని ఆరోపించారు.
వక్ఫ్ బోర్డు బకాయిలపై ఆరోపణలు
2014 నుంచి 2026 వరకు సుమారు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు వక్ఫ్ బోర్డుకు పన్ను బకాయిలు ఉన్నట్లు వక్ఫ్ బోర్డు ఇన్‌స్పెక్టర్ తమకు తెలిపారని కిరాయిదారులు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన సమాచారం ఫోన్‌లో రికార్డు చేసి ఉన్నట్లు తెలిపారు.
నూతన కమిటీ ఏర్పాటులో వక్ఫ్ బోర్డు ఇన్‌స్పెక్టర్ నజీముద్దీన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కిరాయిదారులు ఆరోపించారు. ఇస్మాయిల్ నాయక్‌కు వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలు కూడా చేశారు. ఈ వ్యవహారంపై ముస్లిం సమాజంలో అసంతృప్తి వ్యక్తమవుతోందని తెలిపారు.
నూతన కమిటీ ఏర్పాటు చేయాలి
జామా మసీదుకు వెంటనే నూతన కమిటీని ఏర్పాటు చేసి, మసీదు నిర్వహణను క్రమబద్ధీకరించడంతో పాటు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కిరాయిదారులు, మసీదు బాధ్యులు జేసీ అనిల్ కుమార్‌ను కోరారు. వక్ఫ్ బోర్డు నిబంధనల ప్రకారం పారదర్శకంగా నూతన కమిటీని ఏర్పాటు చేసి మసీదు వ్యవహారాలను సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.