భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: సెప్టెంబర్ 5న జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా పురస్కారాలు అందుకున్న ఉపాధ్యాయులను పీఆర్టీయూ ఇనుగుర్తి మండల శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించారు. మండలంలోని ఇనుగుర్తి హైస్కూల్ హెచ్ఎం అమ్మ యాకయ్య, లక్ష్మీపురం పీఎస్ హెచ్ఎం కుందె చైతన్యలు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు అందుకున్న సందర్భంగా స్థానిక ఎంఈఓ వెన్న వెంకటరెడ్డి అధ్యక్షతన వారిని శాలువాలతో ఘనంగా సత్కరించారు.
జిల్లా పురస్కారాలు అభినందనీయం
ఈ సందర్భంగా ఎంఈఓ వెన్న వెంకటరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు విద్యాబుద్ధులు అందించడంతో పాటు ఆదర్శ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు. విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తూ సమాజానికి మంచి పౌరులను అందించడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు.
ఇనుగుర్తి మండలం నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై పురస్కారాలు అందుకోవడం అభినందనీయమని ఎంఈఓ పేర్కొన్నారు. వారి సేవలను గుర్తించి సన్మానించడం సంతోషంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ అసోసియేట్ అధ్యక్షులు కళ్లెం వెంకటరెడ్డి, మండల అధ్యక్షుడు సూరం భాస్కర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వీరన్న, వివిధ పాఠశాలల హెచ్ఎంలు శరత్, రవీందర్, రమేష్, కోటేశ్వర్, ఉత్తేజ్ తదితరులు పాల్గొన్నారు.