భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

30, సెప్టెంబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

కలిసికట్టుగా నర్సాపూర్ మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకోవాలి: సునీత లక్ష్మారెడ్డి

లొల్లి, పంచాయతీలతో సాధించేది ఏమిలేదు  ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: లొల్లి, పంచాయతీలతో సాధించేది ఏమీ లేదని, పాలకవర్గం సభ్యులంతా కలిసికట్టుగా పనిచేసి నర్సాపూర్ మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకోవాలని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సూచించారు. బుధవారం మున్సిపల్ చైర్‌పర్సన్ లక్ష్మీరాజు యాదవ్ అధ్యక్షతన మున్సిపల్ సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

అభివృద్ధిపై దృష్టి సారించాలి

గతంలో స్టేడియం నిర్మాణానికి రూ.2.6 కోట్లు మంజూరయ్యాయని, అయితే స్థలం అందుబాటులో లేక ఇబ్బందులు ఎదురయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. ప్రస్తుతం స్టేడియం నిర్మాణానికి సంబంధించిన టెండర్ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కూడా త్వరలో లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే పాలకవర్గ సభ్యులంతా సమన్వయంతో కలిసి పనిచేయాలని సునీత లక్ష్మారెడ్డి అన్నారు. అందరూ కలిసి ఉంటేనే అభివృద్ధి వేగంగా జరుగుతుందని, లేకపోతే అభివృద్ధి కుంటుపడుతుందని తెలిపారు. ఏవైనా భేదాభిప్రాయాలు ఉంటే ఎన్నికల సమయంలో చూసుకోవాలని, ప్రస్తుతం ప్రజా సమస్యలు, అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని సూచించారు.

లొల్లి, పంచాయతీలతో సాధించేది ఏమిలేదు  ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి

అన్ని వార్డులను సమానంగా అభివృద్ధి చేయాలి

ఏకాభిప్రాయం లేక గతంలో మున్సిపల్ సమావేశాలు వాయిదా పడిన సందర్భాలు ఉన్నాయని ఎమ్మెల్యే గుర్తుచేశారు. ఇకపై అందరూ సమన్వయంతో ముందుకు సాగాలని కోరారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే ప్రజాప్రతినిధులు ఉన్నారని, అందరూ కలిసి పనిచేస్తే మున్సిపాలిటీకి మరిన్ని నిధులు తీసుకురావడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.

మున్సిపాలిటీ పరిధిలో తాగునీరు, విద్యుత్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా దసరా, బతుకమ్మ పండుగలు సమీపిస్తున్న నేపథ్యంలో వీధి దీపాలను ఎక్కువగా కొనుగోలు చేసి అన్ని ప్రాంతాల్లో తగిన లైటింగ్ ఏర్పాటు చేయాలని అన్నారు. వార్డుల విషయంలో ఎలాంటి పక్షపాతం చూపకుండా అన్ని వార్డులను సమానంగా అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సూచించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ లక్ష్మీరాజు యాదవ్, మున్సిపల్ కమిషనర్ సాయి కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ బుచ్చేష్ యాదవ్, కౌన్సిలర్లు, అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.