భారత్ సమాచార్, మెదక్ జిల్లా: అక్కన్నపేట గ్రామానికి ప్రత్యేకంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) ఏర్పాటు చేయాలని కోరుతూ గ్రామస్తులు మెదక్ జిల్లా సహకార అధికారి (డీసీఓ)ను కలిసి వినతిపత్రం సమర్పించారు. గతంలో అక్కన్నపేట, ఝాన్సీ లింగాపూర్, తోనిగండ్ల గ్రామాలు కలిపి ప్రత్యేక సొసైటీగా కొనసాగేవని, ప్రస్తుతం తమ సొసైటీని రామాయంపేట సొసైటీలో విలీనం చేశారని గ్రామస్తులు తెలిపారు.
గతంలో ఉన్న సొసైటీని పునరుద్ధరించాలి
తమ గ్రామానికి గతంలో ప్రత్యేకంగా ఉన్న పీఏసీఎస్‌ను తిరిగి ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డీసీఓను కోరారు. అక్కన్నపేటలో పీఏసీఎస్ భవనం, గోదాముల ఏర్పాటుకు అవసరమైన సదుపాయాలు ఇప్పటికే ఉన్నాయని తెలిపారు. సొసైటీ కార్యకలాపాల కోసం తమ వద్ద ఒక ఎకరం భూమి కూడా అందుబాటులో ఉందని పేర్కొన్నారు.
అందువల్ల గతంలో మాదిరిగానే అక్కన్నపేటకు ప్రత్యేక పీఏసీఎస్‌ను పునరుద్ధరించి, రైతులకు స్థానికంగానే సహకార సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బక్కయ్య గారి యాదగిరి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగి రాములు, జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు రంగయ్య, జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి చింతల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.