భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

30, సెప్టెంబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

వీబీ-జీ రామ్-జీ పనులపై అవగాహన కల్పించిన మంత్రి

వీబీ-జీ రామ్-జీ పనులపై అవగాహన కల్పించిన మంత్రి

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) బుధవారం రాష్ట్రవ్యాప్తంగా సర్పంచులు, అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లతో వీబీ-జీ రామ్-జీ పథకం అమలుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఇనుగుర్తి మండలానికి చెందిన ఎంపీడీవో బండారి పార్థసారథితో పాటు అధికారులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, వీబీ-జీ రామ్-జీ సిబ్బంది పాల్గొన్నారు.

గ్రామసభల ద్వారా పనుల గుర్తింపు

వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి సీతక్క వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. గ్రామసభల ద్వారా గ్రామాలకు అవసరమైన పనులను గుర్తించి అమలు చేయాలని సూచించారు. ఇంకుడు గుంతలు, ఫారం పాండ్లు, రైతులకు చెందిన పొలాల్లో అవసరమైన పనులు, చేలకులు, పొలాల వద్దకు వెళ్లే దారుల మరమ్మతులు వంటి పనులను గుర్తించాలని తెలిపారు. గ్రామీణ ఉపాధి, నీటి సంరక్షణకు సంబంధించిన పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

వీబీ-జీ రామ్-జీ పనులపై అవగాహన కల్పించిన మంత్రి

మహిళా సర్పంచులకు బదులు భర్తల హాజరు

ఇదిలా ఉండగా, ఇనుగుర్తి మండలంలో మూడు గ్రామాలకు చెందిన మహిళా సర్పంచుల స్థానంలో వారి భర్తలు మంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. లాల్‌తండా సర్పంచ్ లక్ష్మి స్థానంలో ఆమె భర్త వెంకన్న, చిన్ననాగారం సర్పంచ్ చెడుపాక సుజాత స్థానంలో ఆమె భర్త యాకయ్య, లక్ష్మీపురం సర్పంచ్ ముదిరెడ్డి కళావతి స్థానంలో ఆమె భర్త శ్రీనివాస్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

మహిళా సర్పంచులు అధికారిక కార్యక్రమాలతో పాటు తమ విధులను స్వయంగా నిర్వహించాలని అధికారులు సూచిస్తున్న నేపథ్యంలో, అధికారిక కార్యక్రమానికి మహిళా సర్పంచుల స్థానంలో వారి భర్తలు హాజరు కావడం స్థానికంగా చర్చకు దారితీసింది.