భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలంలోని వావిలాల రెవెన్యూ గ్రామంలో రైతులకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏవో భూక్య మహేందర్ ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు వావిలాల గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టు కోసం ఎంపిక చేసినట్లు తెలిపారు.
తక్కువ ఖర్చుతో ప్రకృతి వ్యవసాయం
ఈ సందర్భంగా ఏవో మహేందర్ మాట్లాడుతూ సేంద్రియ, ప్రకృతి వ్యవసాయం ద్వారా పంటల సాగును ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. రసాయన ఎరువులు, పురుగు మందులను అధికంగా వినియోగించడం వల్ల కలిగే నష్టాలను రైతులకు వివరించారు. ప్రకృతి వనరులను వినియోగించుకుంటూ తక్కువ ఖర్చుతో రసాయన రహిత వ్యవసాయం వైపు రైతులు మారాలని సూచించారు.
పైలెట్ ప్రాజెక్టులో భాగంగా ఎంపిక చేసిన 125 మంది రైతులకు ఒక్కొక్కరికి ఒక ఎకరం చొప్పున ప్రకృతి వ్యవసాయం చేపట్టేలా అవగాహన కల్పించారు. ప్రకృతి వనరులను ఉపయోగించి కషాయాల తయారీ, వాటిని వ్యవసాయంలో వినియోగించే విధానంపై రైతులకు వివరించారు. తక్కువ ఖర్చుతో ఆరోగ్యకరమైన పంటలను పండించే విధానాలను రైతులు అవలంబించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బోటిమీదితండా సర్పంచ్ జాటోతు రాంసింగ్, ఏఈఓ మణికంఠ, ప్రాజెక్ట్ ఇన్‌చార్జి సుస్మిత, సీఆర్పీలు రమేష్, సునీతతో పాటు ప్రకృతి వ్యవసాయ రైతులు పాల్గొన్నారు.