భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

30, సెప్టెంబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

నమ్మకం కలిగించేలా సేవలందించాలి: CM రేవంత్‌రెడ్డి

నమ్మకం కలిగించేలా సేవలందించాలి: CM రేవంత్‌రెడ్డి

భారత్ సమాచార్, కరీంనగర్ జిల్లా: ప్రభుత్వంలో పూర్తికాలపు ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బందితో కలిపి పనిచేస్తున్న సుమారు 10.5 లక్షల మంది ఉద్యోగులు తెలంగాణలోని 4 కోట్ల మంది ప్రజలకు సేవలందిస్తున్నారని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అన్నారు. కేవలం 3 శాతం మంది ఉద్యోగులు 95 శాతం ప్రజలకు సేవలందించడం శ్రమ, నిబద్ధతతో కూడుకున్న పని అని పేర్కొన్నారు. ఉద్యోగులంతా అంకితభావంతో పనిచేసినప్పుడే పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు సమర్థవంతంగా అందుతాయని అన్నారు.

కరీంనగర్‌లో కొత్త కలెక్టరేట్ ప్రారంభం

కరీంనగర్‌లో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ)ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. సముదాయం ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన సీఎం, కలెక్టరేట్ కార్యాలయ భవనాన్ని పరిశీలించారు. అనంతరం జిల్లా అధికారులను ఉద్దేశించి మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్, రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

పేదలకు నమ్మకం కలిగించేలా కార్యాలయాలు

నమ్మకం కలిగించేలా సేవలందించాలి: CM రేవంత్‌రెడ్డి

ప్రభుత్వ కార్యాలయాలు పేదవాడికి నమ్మకం, విశ్వాసాన్ని కలిగించేలా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సమస్యలు, బాధలతో ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే నిరుపేదలను కుటుంబ సభ్యులుగా భావించి సేవలందించాలని ఉద్యోగులను కోరారు.

సంక్షేమ పథకాలు పేదలకు చేరడంలో ప్రభుత్వ ఉద్యోగులే కీలక ప్రతినిధులని, వారికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి సహా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చినా, చెడ్డ పేరు వచ్చినా దాని వెనుక ఉద్యోగుల పనితీరు కీలకంగా ఉంటుందని అన్నారు.

ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తున్నాం

ప్రజలకు ప్రభుత్వ నిర్ణయాలు, శాసనాలు, అనుమతులు, సంక్షేమ పథకాల ఫలితాలను చేరవేయడంలో ఉద్యోగుల పాత్ర కీలకమని సీఎం పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతున్నామని తెలిపారు.

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెలా మొదటి తేదీన వేతనాలు చెల్లిస్తున్నామని, ప్రమోషన్లు, బదిలీలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పీఆర్సీ, ఇతర ప్రయోజనాలు, ఆరోగ్య భద్రతకు సంబంధించిన అంశాలను వీలైనంత వరకు పరిష్కరిస్తున్నామని చెప్పారు. అన్ని సమస్యలు పరిష్కారమయ్యాయని చెప్పడం లేదని, ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజలకు సేవలు అందిస్తూనే ఉద్యోగుల సమస్యలను కూడా పరిష్కరించుకుందామని అన్నారు.

కరీంనగర్ అభివృద్ధికి రూ.944 కోట్ల పనులు

నమ్మకం కలిగించేలా సేవలందించాలి: CM రేవంత్‌రెడ్డి

కరీంనగర్ జిల్లాలో రూ.944 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించామని, మరికొన్ని పనులకు శంకుస్థాపనలు చేశామని సీఎం తెలిపారు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద కేంద్ర ప్రభుత్వ సహకారంతో రూ.840 కోట్ల నిధులు సాధించామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరిస్తే ముఖ్యమంత్రిగా అభినందించడంలో ఎలాంటి శషబిషలు లేవని అన్నారు.

ఎన్నికల సమయంలోనే రాజకీయాలు ఉంటాయని, మిగిలిన సమయంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పరస్పర సహకారంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు. వందల కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు నిర్మించినా కేంద్ర ప్రభుత్వ అనుమతులు లేకపోతే వాటి ప్రయోజనం ప్రజలకు అందదని అన్నారు. అభివృద్ధి కోసం కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తుందని తెలిపారు.

కంటోన్మెంట్ భూములపై సీఎం ప్రస్తావన

కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే మార్గంలో కంటోన్మెంట్ ప్రాంతం అతిపెద్ద ప్రతిబంధకంగా మారిందని సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. గతంలో పలువురు నాయకులు ఈ సమస్య పరిష్కారానికి ప్రయత్నించినప్పటికీ పూర్తిగా పరిష్కారం కాలేదని పేర్కొంటూ, తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసి సమస్యను వివరించానని గుర్తుచేశారు.

ఆరు నెలల్లోనే కంటోన్మెంట్ పరిధిలో దాదాపు 170 ఎకరాల భూమిని రాష్ట్రానికి అందించారని సీఎం తెలిపారు. కంటోన్మెంట్ ప్రాంతంలో దాదాపు రూ.5 వేల కోట్లతో చేపట్టనున్న ఎలివేటెడ్ కారిడార్‌ను ఏడాదిలోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. బేగంపేట విమానాశ్రయం రన్‌వే కింద నుంచి రహదారి నిర్మించేందుకు కూడా అనుమతులు సాధించామని తెలిపారు.

అభివృద్ధి పనుల విషయంలో రాజకీయ సిద్ధాంతాలు వేరైనా పరస్పర సహకారంతో ముందుకు సాగుతామని సీఎం స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లాకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, ఇతర అంశాలపై మరోసారి జిల్లాకు వచ్చి సమగ్రంగా సమీక్ష నిర్వహిస్తానని ముఖ్యమంత్రి తెలిపారు.