భారత్ సమాచార్, మెదక్ జిల్లా: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు, వైద్య సంస్థలు వైద్య సంస్థల చట్టంలోని నిబంధనలను కచ్చితంగా అమలు చేసేలా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ క్యాంప్ కార్యాలయం నుంచి గూగుల్ మీట్ ద్వారా సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. ఆసుపత్రుల్లో రోగుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అగ్ని ప్రమాదాలు, విద్యుత్ ప్రమాదాలు, ఇతర అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వైద్య సంస్థల చట్టాన్ని కచ్చితంగా అమలు చేయడంతో పాటు రోగులను సురక్షితంగా ఉంచేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
నివాస భవనాల్లోని ఆసుపత్రులపై ప్రత్యేక దృష్టి
నివాస అవసరాల కోసం నిర్మించిన భవనాల్లో నిర్వహిస్తున్న ఆసుపత్రులను ప్రత్యేకంగా పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు. ఆసుపత్రుల నిర్వహణకు అవసరమైన భద్రతా ప్రమాణాలు, అగ్ని ప్రమాదాల నివారణ ఏర్పాట్లు, అత్యవసర సేవలు, విద్యుత్ భద్రత తదితర సదుపాయాలు నిబంధనల మేరకు ఉన్నాయా లేదా నిర్ధారించాలని సూచించారు.
అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు రోగులు, వారి బంధువులు, ఆసుపత్రి సిబ్బందిని తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తగిన ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా అగ్ని ప్రమాదాల సమయంలో పొగ వ్యాప్తి వల్ల ప్రమాద తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున ప్రత్యామ్నాయ మార్గాలు, అత్యవసర మెట్ల మార్గాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అగ్నిమాపక పరికరాల తనిఖీ తప్పనిసరి
ప్రతి ఆసుపత్రిలో అగ్నిమాపక పరికరాలు, హెచ్చరిక వ్యవస్థలు, విద్యుత్ భద్రతా ఏర్పాట్లు తదితరాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. తనిఖీల్లో లోపాలు గుర్తించిన వెంటనే వాటిని సరిచేయించాలని సూచించారు. ఆసుపత్రి సిబ్బందికి అత్యవసర పరిస్థితుల్లో రోగులను సురక్షితంగా తరలించే విధానంపై క్రమం తప్పకుండా శిక్షణ అందించాలని తెలిపారు.
జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు, వైద్య సంస్థలను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో తనిఖీ చేసి, నిబంధనల అమలుపై సమగ్ర నివేదికను సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. రోగుల ప్రాణ భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యానికి తావు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి జ్ఞానేశ్వర్‌తో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.