భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ సాంప్రదాయంలో బతుకమ్మ పండుగకు ముందు వచ్చే బొడ్డెమ్మ పండుగను ఇనుగుర్తి మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో గురువారం భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు. భాద్రపద మాసంలో వినాయక చవితి అనంతరం బహుళ పంచమి రోజున ప్రారంభమయ్యే ఈ పండుగను మహాలయ అమావాస్య వరకు మొత్తం తొమ్మిది రోజుల పాటు నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో బాలికలు, యువతులు, మహిళలు పుట్ట మట్టిని తీసుకువచ్చి సాక్షాత్తు గౌరీదేవిగా భావించి బొడ్డెమ్మలను తయారు చేశారు. సాయంత్రం వేళ తీరొక్క పూలను తీసుకువచ్చి బొడ్డెమ్మలకు అలంకరించారు. అనంతరం భక్తిశ్రద్ధలతో బొడ్డెమ్మ చరిత్రను తెలిపే పాటలు పాడుతూ, లయబద్ధంగా చప్పట్లు కొడుతూ నృత్యాలు చేశారు. దీంతో గ్రామాల్లో పండుగ సందడి నెలకొంది.
చిన్ననాగారంలో ఘనంగా వేడుకలు
చిన్ననాగారం గ్రామంలో హనుమాన్ ఆలయం వద్ద, ముత్యాలమ్మ టెంపుల్ ఆవరణలో, గడివాడ, ఐదవ వార్డు, అంబేద్కర్ కమిటీ హాల్, బురుజుగడ్డవాడ, కొత్తవాడ ప్రాంతాల్లో బాలికలు, మహిళలు పెద్ద ఎత్తున బొడ్డెమ్మ వేడుకలు నిర్వహించారు.
భక్తిశ్రద్ధలతో బొడ్డెమ్మ పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ నృత్యాలతో ఆడి పాడారు. గ్రామంలోని పలు వీధుల్లో బొడ్డెమ్మ పండుగను ఘనంగా నిర్వహిస్తూ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.