భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ పట్టణంలోని లక్ష్మీ థియేటర్లో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ‘ది ప్యారడైజ్’ చిత్రాన్ని వీక్షించారు. మాజీ ఎమ్మెల్యే బాణోత్ శంకర్ నాయక్, మాజీ జడ్పీ చైర్పర్సన్ బిందు ఆంగోత్తో పాటు సుమారు 220 మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో కలిసి ఆమె సినిమాను వీక్షించారు. ‘ది పారడైజ్’ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించగా, నాని ప్రధాన పాత్రలో నటించారు.
తెలంగాణ భాష, సంస్కృతిపై ప్రశంసలు
ఈ సందర్భంగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. ‘ది ప్యారడైజ్’ సినిమా అణచివేతకు గురైన ఒక సమాజం కథను చెప్పే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోందన్నారు. తెలంగాణ భాష, యాస, పదజాలం, జానపద సంస్కృతి, తెలంగాణ మట్టి వాసన వంటి అంశాలను కథలో భాగంగా చూపించడం ఆకట్టుకుందని తెలిపారు.
సినిమాలో కేసీఆర్ ప్రస్తావనకు సంబంధించిన సన్నివేశాలు వచ్చిన సమయంలో ప్రేక్షకుల్లో ప్రత్యేక స్పందన కనిపించిందని ఆమె అన్నారు. ముఖ్యంగా ప్రియదర్శి పోషించిన శంకరన్న పాత్ర, తెలంగాణ యాస, మాట తీరు, బాడీ లాంగ్వేజ్ తనను ఆకట్టుకున్నాయని తెలిపారు. ఆ పాత్రను చూస్తున్నప్పుడు తెలంగాణ ఉద్యమ రోజులు, కేసీఆర్ జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయని పేర్కొన్నారు.
అహింసా మార్గాన్ని గుర్తుచేసే సందేశం
సినిమాలోని కొన్ని సంభాషణలు కేవలం వినోదానికే పరిమితం కాకుండా ఆలోచింపజేసేలా ఉన్నాయని సత్యవతి రాథోడ్ అన్నారు. ముఖ్యంగా శంకరన్న పాత్ర ద్వారా స్వేచ్ఛను సహనంతో సాధించాలనే భావనను వ్యక్తం చేయడం గాంధీజీ, పొట్టి శ్రీరాములు వంటి మహనీయుల అహింసా మార్గాన్ని గుర్తుచేస్తుందని తెలిపారు. హింస ద్వారా మాత్రమే అన్ని సాధించలేమని, అహింసాయుత మార్గాలకు కూడా ప్రాధాన్యత ఉందనే సందేశాన్ని సినిమా అందిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
తెలంగాణ సంస్కృతి, మట్టి వాసన, స్థానిక భాషా యాసలను తెరపై బలంగా చూపించిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, హీరో నాని, ప్రియదర్శి సహా చిత్ర యూనిట్ సభ్యులందరికీ సత్యవతి రాథోడ్ అభినందనలు తెలిపారు. ప్రేక్షకులను అలరిస్తూనే సామాజిక అంశాలపై ఆలోచింపజేసేలా సినిమాను రూపొందించినందుకు చిత్ర బృందాన్ని అభినందించారు.