భారత్ సమాచార్, మెదక్ జిల్లా: జర్నలిస్టుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో పోరాటాన్ని కొనసాగిస్తామని టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డీజీ శ్రీనివాస్ శర్మ, రామాయంపేట ప్రెస్‌క్లబ్ మాజీ అధ్యక్షుడు బసన్నపల్లి మల్లేశం అన్నారు. జర్నలిస్టుల హక్కులు, భద్రత కోసం ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) ఇచ్చిన పిలుపు మేరకు గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం దేశవ్యాప్తంగా నిర్వహించిన డిమాండ్ల దినోత్సవ నిరసన కార్యక్రమానికి రామాయంపేటకు చెందిన జర్నలిస్టులు మెదక్‌కు తరలివెళ్లారు.
జర్నలిస్టులకు ప్రత్యేక రక్షణ చట్టం
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి వాటి పరిష్కారం కోసం జర్నలిస్టులు నిరంతరం శ్రమిస్తున్నప్పటికీ, అదే జర్నలిస్టులు వ్యక్తిగతంగా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న జర్నలిస్టులు, మీడియా సిబ్బందికి రక్షణ కల్పించేలా ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. గతంలో ఉన్న జర్నలిస్టుల హక్కులను పునరుద్ధరించడంతో పాటు, రద్దు చేసిన చట్టాల స్థానంలో జర్నలిస్టులకు చట్టబద్ధమైన రక్షణ కల్పించాలని కోరారు.
ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు ఇవ్వాలి
జర్నలిస్టుల ఆర్థిక, సామాజిక భద్రతకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, నూతన వేజ్ బోర్డును ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించడంతో పాటు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని కోరారు. జర్నలిస్టులపై దాడులు, వేధింపులు జరగకుండా ప్రత్యేక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు పాతూరి రమేష్‌గౌడ్, రామాయంపేట ప్రెస్‌క్లబ్ మాజీ ప్రధాన కార్యదర్శి పటేరి రాము, మాజీ కోశాధికారి తుజాల శ్రీనివాస్‌గౌడ్, సభ్యులు బొంతల సత్యనారాయణ, తుడుం పెంటయ్య, కర్రే నరేందర్, సభావత్ సర్దార్, గజ్జల రామచంద్రారెడ్డి, సార్గు నర్సింలు తదితరులు పాల్గొన్నారు.