భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

2, అక్టోబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

స్వచ్ఛతతోనే బాపూజీకి నిజమైన నివాళి: మున్సిపల్ చైర్మన్

మహాత్మ గాంధీ చూపిన మార్గంలో పయనిద్దాం

భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: జాతిపిత మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం, స్వావలంబన, సమానత్వం దిశగా ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలని భైంసా మున్సిపల్ చైర్మన్ తూమోల్ల దత్తాత్రి అన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని గాంధీ గంజ్ ఆవరణలో ఉన్న బాపూజీ విగ్రహానికి ఆయన పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

అదేవిధంగా భైంసా మున్సిపల్ కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గాంధీ గంజ్ ఆవరణలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

మహాత్మ గాంధీ చూపిన మార్గంలో పయనిద్దాం

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ తూమోల్ల దత్తాత్రి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు, ప్రపంచానికి అహింసా మార్గాన్ని చూపేందుకు గాంధీజీ చేసిన కృషి మహోన్నతమైనదని అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ చూపిన సత్యం, ధర్మం, అహింసా మార్గాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని పిలుపునిచ్చారు.

గాంధీజీ కలలు కన్న సమానత్వం, గ్రామ స్వరాజ్యం, స్వావలంబన, స్వచ్ఛతను సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. గాంధీజీ ఆశయాలను సాకారం చేయడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. గాంధీ స్ఫూర్తితో స్వచ్ఛ భారత్ కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో భైంసా మున్సిపల్ ఇన్‌చార్జి కమిషనర్ సంతోష్ కుమార్, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.