భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: గ్రామ పరిసరాల్లో నిర్మిస్తున్న రైస్ మిల్ నిర్మాణ పనులను నిలిపివేసి, ఎలాంటి అనుమతులు ఇవ్వవద్దని కోరుతూ మండలంలోని చిన్ననాగారం గ్రామస్తులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఎర్రబెల్లిగూడెం–చిన్ననాగారం ప్రధాన రహదారిపై నిర్మాణంలో ఉన్న రైస్ మిల్ సమీపంలో గ్రామస్తులు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు గుడాల లక్ష్మారెడ్డి, ఉడత సోమయ్య యాదవ్ తదితరులు మాట్లాడుతూ గ్రామానికి కనీస దూరంలో రైస్ మిల్ నిర్మించాలనే నిబంధనలకు విరుద్ధంగా మిల్లు నిర్మాణ పనులు చేపడుతున్నారని ఆరోపించారు. మిల్లు నిర్మిస్తున్న ప్రాంతానికి సమీపంలో గ్రామస్తుల ఇళ్లు, గిరిజన తండా గృహాలు ఉన్నాయని తెలిపారు.
రైస్ మిల్ ఏర్పాటుతో ధ్వని కాలుష్యంతో పాటు ఊక, తౌడు, దుమ్ము వ్యాపించి ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వడ్ల లారీలు పెద్ద సంఖ్యలో రోడ్డుపై నిలిచిపోయే అవకాశం ఉండటంతో గ్రామస్తులు, రైతులు, ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయని పేర్కొన్నారు.
మిల్లులో పనిచేయడానికి బీహార్ తదితర రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకువచ్చే అవకాశం ఉందని, దీనివల్ల గ్రామంలో ముఖ్యంగా మహిళలకు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంటుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
చిన్న మిల్లు పేరుతో భారీ మిల్లుకు ఏర్పాట్లు
సంబంధిత స్థలంలో గతంలో రైతుల వడ్లను పట్టించేందుకు డీజిల్‌తో నడిచే చిన్న మిల్లు ఉండేదని గ్రామస్తులు తెలిపారు. అయితే ఆ మిల్లును సుమారు పదేళ్ల క్రితమే మూసివేశారని పేర్కొన్నారు. ప్రస్తుతం అదే ప్రాంతంలో సీఎంఆర్ కోసం భారీ రైస్ మిల్ ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు.
గ్రామస్తుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని రైస్ మిల్ నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయడంతో పాటు ఎలాంటి అనుమతులు ఇవ్వవద్దని సంబంధిత అధికారులను కోరారు. ఈ మేరకు గతంలోనే గ్రామసభలో దరఖాస్తు అందజేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలకుంట్ల సోమయ్య, బైరు రమేష్, బొబ్బల దేవరాజు, గుగులోతు లక్ష్మి, మాదగాని వెంకటేశం, మాదగాని ఉమేష్, వడపల్లి వెంకన్న, బత్తిని ఐలయ్య, మునిగంటి రమేష్, గుండాల దుర్గాస్వామి, నిడిగంటి బిక్షం, గుగులోతు జానీ, మద్దెబోయిన సాంబరాజు తదితరులు పాల్గొన్నారు.