భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

2, అక్టోబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

విశ్వకర్మ మహాసభ జిల్లా అధ్యక్షురాలిగా మడుపు స్వప్న

విశ్వకర్మ మహాసభ జిల్లా అధ్యక్షురాలిగా మడుపు స్వప్న

భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: ది అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ నిజామాబాద్ జిల్లా మహిళా అధ్యక్షురాలిగా శ్రీమతి మడుపు స్వప్న నియమితులయ్యారు. రాష్ట్ర అధ్యక్షులు కౌలే జగన్నాథం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంకోజు లింగాచారి ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు గంగా మోహన్, మడుపు స్వప్నను జిల్లా మహిళా అధ్యక్షురాలిగా నియమించారు.

సంఘ అభివృద్ధికి కృషి చేయాలి

ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు కౌలే జగన్నాథం మాట్లాడుతూ.. జిల్లా మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన మడుపు స్వప్నకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సంఘ అభివృద్ధికి, విశ్వకర్మ బంధువుల ఐక్యతకు, మహిళా సాధికారతకు నిరంతరం కృషి చేస్తూ సంఘాన్ని మరింత బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు.

ప్రస్తుతం పురుషులతో పాటు మహిళలు కూడా అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారని పేర్కొన్నారు. అదే స్ఫూర్తితో సంఘాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు మడుపు స్వప్న కృషి చేస్తారని, సంఘ అభివృద్ధికి సహకరిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.

ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన స్వప్న

ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన నిజామాబాద్ జిల్లా మహిళా అధ్యక్షురాలు మడుపు స్వప్న మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు గంగా మోహన్, జిల్లా ప్రధాన కార్యదర్శి డి.ఎల్.ఎన్. చారి, రాష్ట్ర కమిటీ సభ్యులు, మండల కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ సంఘ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర, నిజామాబాద్ జిల్లా సంఘ సభ్యులు, విశ్వబ్రాహ్మణ సోదర, సోదరీమణులు, ఇతర సంఘ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.