భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: భారతదేశ రెండో మాజీ ప్రధాని, భారతరత్న లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని విస్మరించవద్దని ఇనుగుర్తి మండలం అయ్యగారిపల్లి గ్రామానికి చెందిన వార్డు సభ్యులు మార్క నరేష్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
మహాత్మా గాంధీ పిలుపు మేరకు లాల్ బహదూర్ శాస్త్రి ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా వంటి స్వాతంత్ర్య పోరాటాల్లో పాల్గొని జైలు శిక్ష అనుభవించారని మార్క నరేష్ తెలిపారు. స్వాతంత్ర్యం అనంతరం రైల్వే మంత్రిగా పనిచేసిన శాస్త్రి.. ఒక రైలు ప్రమాదానికి బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేసి నిజాయితీని చాటుకున్నారని పేర్కొన్నారు.
దేశానికి విశేష సేవలు
దేశానికి రెండో ప్రధానమంత్రిగా లాల్ బహదూర్ శాస్త్రి ఎంతో సేవ చేశారని నరేష్ అన్నారు. భారత్–పాకిస్తాన్ యుద్ధ సమయంలో దేశాన్ని సమర్థవంతంగా నడిపించిన మహానేతగా ఆయన సేవలను గుర్తు చేశారు. జవాన్లతో పాటు రైతుల సేవలు కూడా దేశానికి ఎంతో కీలకమని చాటి చెప్పేలా ‘జై జవాన్.. జై కిసాన్’ నినాదాన్ని శాస్త్రి అందించారని పేర్కొన్నారు.
అధికారికంగా జయంతి నిర్వహించాలని విజ్ఞప్తి
మహాత్మా గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి ఒకే రోజున వస్తున్నప్పటికీ ఇద్దరి జయంతి వేడుకలను నిర్వహించేలా అధికారిక ఆదేశాలు ఇవ్వకపోవడంపై మార్క నరేష్ విస్మయం వ్యక్తం చేశారు. ఇక ముందైనా లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని అధికారికంగా నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.