భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండల కేంద్రంలోని పీఎం శ్రీ మోడల్ స్కూల్ ఉపాధ్యాయురాలు అంజుమ్ సుల్తానాకు అరుదైన గౌరవం లభించింది. హైదరాబాద్‌లోని లాల్ బహదూర్ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన గాంధీ జయంతి వేడుకల్లో ఆమెకు ప్రతిభా పురస్కారం అందజేసి ఘనంగా సన్మానించారు.
మహాత్మా గాంధీ 157వ జయంతిని పురస్కరించుకొని గాంధీ జ్ఞాన ప్రతిష్ఠాన్, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యారంగంలో అంజుమ్ సుల్తానా చేస్తున్న నిరుపమాన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందజేశారు. అంజుమ్ సుల్తానా, అబ్దుల్ ఖాదర్ జిలానీ దంపతులకు ప్రతిభా అవార్డును ప్రదానం చేసి సత్కరించారు.
సమగ్ర కృషికి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు
విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, సామాజిక అవగాహన, నాణ్యమైన బోధన కోసం అంజుమ్ సుల్తానా చేస్తున్న కృషికి ఈ పురస్కారం గుర్తింపుగా నిలిచింది. విద్యార్థులను రాష్ట్రస్థాయిలో నిర్వహించే వివిధ పోటీల్లో పాల్గొనేలా మార్గదర్శనం చేస్తూ ఆమె విశేష కృషి చేస్తున్నారు.
మరోవైపు స్టేట్ రిసోర్స్ పర్సన్‌గా కూడా విద్యారంగానికి అంజుమ్ సుల్తానా సేవలందిస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. విద్యార్థుల ప్రతిభను వెలికితీయడంతో పాటు వారికి నాణ్యమైన విద్య అందించేందుకు ఆమె చేస్తున్న కృషికి రాష్ట్రస్థాయిలో గుర్తింపు లభించడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు.
ఈ వేడుకల్లో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.