భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: కేసముద్రం మండలంలోని నారాయణపురం గ్రామానికి చెందిన గిరిజన రైతులు తమ భూములకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) అనిల్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా రైతు బానోతు యాకూబ్ మాట్లాడుతూ.. సర్వే నంబర్ 117లోని 146 ఎకరాల భూమిని 126 మంది రైతులు గత 70 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నామని తెలిపారు. ఈ భూములకు గతంలో పట్టాలు ఉన్నప్పటికీ ధరణి పోర్టల్‌లో తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో గత తొమ్మిది సంవత్సరాలుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు.
రైతు ప్రయోజనాలకు దూరం
పట్టాలు లేకపోవడంతో రైతులకు రుణమాఫీ కాలేదని, యూరియా వంటి ఎరువులు అందడం లేదని యాకూబ్ తెలిపారు. రైతుబంధు కూడా వర్తించకపోవడంతో ఇప్పటికే 10 మంది రైతులు మృతి చెందారని చెప్పారు. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో అప్పుల పాలయ్యామని, పరిస్థితుల కారణంగా భూములను విక్రయించాలనుకున్నా పట్టాలు లేకపోవడంతో ఎవరూ కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తమ సమస్య తీవ్రతను ఇప్పటికే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, ఎంజాయ్‌మెంట్ సర్వే కూడా నిర్వహించినప్పటికీ ఇప్పటివరకు పట్టాలు ఇవ్వలేదని తెలిపారు. సమస్యను పరిష్కరించి తమకు న్యాయం చేయాలని రైతులు జేసీని కోరారు.
భూభారతి ద్వారా పట్టాలు ఇవ్వాలి
భూభారతి ద్వారా తమ భూములకు పట్టాలు ఇవ్వాలని రైతులు ప్రభుత్వాన్ని కోరారు. పలువురు రైతులకు భూభారతి ద్వారా పట్టాలు అందించి ఏళ్ల తరబడి ఉన్న భూ సమస్యలను పరిష్కరించారని యాకూబ్ తెలిపారు. అదే తరహాలో నారాయణపురం రైతులకు కూడా పట్టాలు అందించి తమ సమస్యను పరిష్కరించాలని ఆయనతో పాటు రైతులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో రైతులు రాజు, హుస్సేన్, బగ్గు, సుమన్, హనుమత్, హరి, కుమార్, బాలు, రవి తదితరులు పాల్గొన్నారు.