భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ నియోజకవర్గ పర్యటనలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నాయకుడు హరీశ్‌రావు కాగజ్ మద్దూర్ గ్రామంలో దయనీయ పరిస్థితిని చూసి ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డితో కలిసి వెళ్తున్న ఆయనకు మార్గమధ్యంలో కరెంట్ లేక ఎండిపోతున్న వరి పొలాలు కనిపించాయి. దీంతో పొలంలోకి వెళ్లిన హరీశ్‌రావు అక్కడ ఉన్న మహిళా రైతు చిట్టోళ్ల నాగమణితో మాట్లాడి ఆమె కష్టాలను అడిగి తెలుసుకున్నారు.
మూడు ఎకరాల్లో సగం పంట ఎండిపోయింది
మహిళా రైతు నాగమణి తన ఆవేదనను హరీశ్‌రావు వద్ద వ్యక్తం చేసింది. బోర్లలో నీళ్లు ఉన్నప్పటికీ విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో పంటలు కళ్లెదుటే ఎండిపోతున్నాయని వాపోయింది. సుమారు రూ.60 వేల పెట్టుబడితో మూడు ఎకరాల్లో వరి నాట్లు వేస్తే.. అందులో సగం పొలం పూర్తిగా ఎండిపోయిందని తెలిపింది.
పంట పొట్టకొచ్చే దశలో నీరు అత్యంత అవసరమని, అదే సమయంలో విద్యుత్ సరఫరా సరిగా లేకపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారుతోందని నాగమణి ఆవేదన వ్యక్తం చేసింది.
గతంలో పగటిపూట నిరంతరాయంగా కరెంట్ వచ్చేది
గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పగటిపూట నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అయ్యేదని నాగమణి గుర్తుచేసుకుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంటలు సాగు చేసుకున్నామని తెలిపింది. ప్రస్తుతం కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందని వాపోయింది.
ఉదయం 5 గంటలకు రావాల్సిన విద్యుత్ 8 గంటలకు వస్తోందని, వచ్చిన కరెంట్ కూడా నిలకడగా ఉండకుండా మధ్యాహ్నం మళ్లీ కోతలకు గురవుతోందని వివరించింది.
లో వోల్టేజ్‌తో మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయని ఆవేదన
విద్యుత్ కోతలతో పాటు లో వోల్టేజ్ సమస్య కూడా రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని నాగమణి తెలిపింది. లో వోల్టేజ్ కారణంగా పదేపదే ఫ్యూజులు ఎగిరిపోతున్నాయని, మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయని చెప్పింది.
నెల రోజుల్లోనే మూడు సార్లు ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయిందని, వాటి మరమ్మతుల కోసం ఒక్కోసారి నాలుగు రోజుల పాటు విద్యుత్ లేక పొలాలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేసింది. కరెంట్ వచ్చిపోవడంతో పారిన మడికే నీరు చేరుతోందని, కింది మడులకు నీరు అందడం లేదని వివరించింది.
రైతుల పరిస్థితిపై హరీశ్‌రావు ఆవేదన
నాగమణి ఒక్కరి సమస్యే కాకుండా ఆ ప్రాంతంలోని పలువురు రైతులు కూడా విద్యుత్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని హరీశ్‌రావు తెలుసుకున్నారు. కరెంట్ సరఫరా సక్రమంగా లేక పంటలు ఎండిపోతున్న పరిస్థితిని ప్రత్యక్షంగా చూసి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.