భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: అర్హులైన ఏ ఒక్క ఓటరూ తమ ఓటు హక్కును కోల్పోకుండా ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు టి.కె. శ్రీదేవి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రాతో కలిసి ఎస్ఐఆర్ ప్రక్రియపై ఆమె సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా టి.కె. శ్రీదేవి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకమని పేర్కొన్నారు. మెరుగైన సమాజ నిర్మాణానికి ఓటు హక్కు పునాది వంటిదన్నారు. ఓటు హక్కు దుర్వినియోగాన్ని అరికట్టడం ఎంత ముఖ్యమో.. అర్హులైన ఒక్క ఓటరూ ఓటు హక్కును కోల్పోకుండా చూడటం కూడా అంతే ముఖ్యమని స్పష్టం చేశారు.
ఎస్ఐఆర్ ప్రక్రియపై సంతృప్తి
జిల్లాలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహిస్తున్న కలెక్టర్, అధికారులను, సహకరిస్తున్న రాజకీయ పార్టీల ప్రతినిధులను అభినందించారు. మిగిలి ఉన్న ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.
బీఎల్ఓలు తప్పనిసరిగా ఓటర్ల ఇళ్లకు స్వయంగా వెళ్లి ధ్రువపత్రాల పరిశీలన చేపట్టాలని ఆదేశించారు. ఓటర్ల జాబితా నుంచి తొలగించిన ఓట్లకు సంబంధించిన కారణాలను రికార్డుల్లో స్పష్టంగా నమోదు చేయాలని సూచించారు. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా రికార్డులను పక్కాగా నిర్వహించాలని తెలిపారు.
ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి
ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి అందే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓటు హక్కు ప్రాముఖ్యతపై స్వీప్ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు.
అధికారులంతా మరింత బాధ్యతతో పనిచేసి జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు టి.కె. శ్రీదేవి ఆదేశించారు.
పోలింగ్ కేంద్రాల పరిశీలన
సమీక్ష అనంతరం రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు టి.కె. శ్రీదేవి, కలెక్టర్ భవేశ్ మిశ్రాతో కలిసి నిర్మల్లోని కస్బా, నిర్మల్ గ్రామీణ మండలంలోని న్యూ పోచంపాడ్ గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. అక్కడ కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై స్థానిక బీఎల్ఓలను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాథోడ్ రమేష్, భైంసా, ఉట్నూర్ సబ్ కలెక్టర్లు అజ్మీరా సంకేత్ కుమార్, ప్రణయ్ కుమార్, ఆర్డీవో దేవీదాస్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.