భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

3, అక్టోబర్ 2026, శనివారంభారత్ సమాచార్

ప్రజాసమస్యలు వేగంగా పరిష్కరించాలి: MLA మురళి నాయక్

ప్రజాసమస్యలు వేగంగా పరిష్కరించాలి: MLA మురళి నాయక్

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ప్రజా సమస్యల పరిష్కారంలో ఎలాంటి ఆలస్యం చేయకుండా వేగంగా పరిష్కరించాలని ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్ అధికారులను ఆదేశించారు. శనివారం నెల్లికుదురులో సర్పంచులు, వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన విస్తృతస్థాయి సమీక్ష సమావేశానికి ఎమ్మెల్యే హాజరయ్యారు.

ఈ సందర్భంగా మండలంలోని గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై శాఖల వారీగా సుదీర్ఘంగా సమీక్షించారు.

గ్రామాలను తరచూ సందర్శించాలి

ఎమ్మెల్యే మురళి నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, గ్రామాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. అదే స్ఫూర్తితో అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ప్రజలకు అవసరమైన ప్రభుత్వ సేవలు ఎలాంటి ఆలస్యం లేకుండా అందేలా క్షేత్రస్థాయిలో పనిచేయాలని ఆదేశించారు.

అధికారులు కార్యాలయాలకే పరిమితం కాకుండా గ్రామాలను తరచూ సందర్శించాలని, క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును అత్యంత ప్రాధాన్యతతో తీసుకోవాలని, చిన్న సమస్య అయినా నిర్లక్ష్యం చేయవద్దని స్పష్టం చేశారు.

మౌలిక వసతులపై శాఖల వారీగా సమీక్ష

ప్రజాసమస్యలు వేగంగా పరిష్కరించాలి: MLA మురళి నాయక్

సమావేశంలో తాగునీటి సరఫరా, విద్యుత్ సమస్యలు, గ్రామీణ రహదారుల మరమ్మతులు, పారిశుధ్యం, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రుల సేవలు, వ్యవసాయ శాఖ పనితీరు, సాగునీటి సమస్యలు, పింఛన్లు, రేషన్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, సీసీ రోడ్లు, డ్రైనేజీలు తదితర అంశాలపై ఎమ్మెల్యే అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

కొనసాగుతున్న అభివృద్ధి పనుల్లో ఎక్కడెక్కడ పనులు పెండింగ్‌లో ఉన్నాయో గుర్తించి, వాటిని నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని సూచించారు.

గ్రామాల సమస్యలపై ఎమ్మెల్యే ఆరా

వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు తమ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, ప్రజల అవసరాలు, అభివృద్ధి పనులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి సమస్యను శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే.. సంబంధిత శాఖల అధికారులతో అక్కడికక్కడే చర్చించి పరిష్కార మార్గాలను సూచించారు.

ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే మురళి నాయక్ సూచించారు.

ఈ సమీక్ష సమావేశంలో తహసీల్దార్ చందా నరేష్, ఎంపీడీవో సింగారపు కుమార్, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.