భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: వీబీజీ రాంజీ పథకంలో చేపట్టే పనులను పారదర్శకంగా నిర్వహించాలని ఎంపీడీవో పార్థసారథి సూచించారు. శనివారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మండలంలోని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, వీబీజీ రాంజీ ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లకు వీబీజీ రాంజీ పనులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో పార్థసారథి మాట్లాడుతూ.. మండలంలో అవసరమైన ప్రాంతాల్లో పనులను గుర్తించి, ఉపాధి కూలీలకు పనులు కల్పిస్తూ వాటిని వేగంగా పూర్తి చేయాలని సూచించారు. పనుల ఎంపిక నుంచి పూర్తయ్యే వరకు ప్రతి దశలో పారదర్శకత పాటించాలని తెలిపారు.
క్షేత్రస్థాయిలో పనుల గుర్తింపు
వీబీజీ రాంజీ పథకంలో భాగంగా ఇంకుడు గుంతలు, వ్యవసాయ క్షేత్రాల్లో నీటి గుంటలు, మరుగుదొడ్లు తదితర పనులతో పాటు సుమారు 350 రకాల పనులు ఉన్నాయని ఎంపీడీవో తెలిపారు. ప్రజలకు ఏ పనులు అవసరమో, ఎక్కడ ఎలాంటి పనులు చేపట్టాలో క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణయించాలని సూచించారు.
ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు, వీబీజీ రాంజీ సిబ్బంది, ప్రజలు, రైతులతో కలిసి గ్రామాల్లో పర్యటించి అవసరమైన పనులను గుర్తించాలని కోరారు. పనుల అవసరాన్ని గుర్తించిన అనంతరం ప్రాధాన్యత క్రమంలో వాటిని చేపట్టి, ఉపాధి కూలీలకు నిరంతరం పని కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో దిశ సభ్యులు గుజ్జునూరి బాబురావు, ఏపీవో దీప్ల తదితరులు పాల్గొన్నారు.