భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మానుకోట మెడికల్ కళాశాలకు మరో మృతదేహాన్ని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం అప్పగించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ మహబూబాబాద్ ఆధ్వర్యంలో మండల స్వర్ణకార సంఘం సహకారంతో మోత్కూరు పరమేశ్వర్ (60) పార్థివదేహాన్ని మెడికల్ కళాశాలకు అందజేశారు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన పరమేశ్వర్ శనివారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆరోగ్యం విషమించడంతో పరమేశ్వర్ మృతి చెందారు. అనంతరం మృతుడి సోదరుడు ప్రభాకర్తో పాటు స్వర్ణకారుల సంఘం సభ్యులు మృతదేహాన్ని మెడికల్ కళాశాలకు అప్పగించేందుకు ముందుకు వచ్చారు.
ఈ మేరకు లయన్స్ క్లబ్ సీనియర్ బాధ్యులు కొండపల్లి కేశవరావు, క్లబ్ సెక్రటరీ పారుపల్లి రమేష్ బాబు, పరకాల రవీందర్ రెడ్డి, జిల్లా స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు మోత్కూరు శంకర్, మండల సంఘం అధ్యక్షుడు పమ్మి సనాతనచారి, వంగాల పూర్ణాచారిలు ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ బి. జగదీశ్వర్, సీఎంఓ డాక్టర్ రాంరెడ్డి సమక్షంలో మెడికల్ కళాశాల అనాటమీ హెచ్ఓడీ డాక్టర్ భరత్ కుమార్కు పరమేశ్వర్ మృతదేహాన్ని అప్పగించారు.
కాగా, మానుకోట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గత నెల రోజుల వ్యవధిలోనే మూడు పార్థివదేహాలను మెడికల్ కళాశాలకు అప్పగించినట్లు క్లబ్ నిర్వాహకులు తెలిపారు. వైద్య విద్యార్థులకు వైద్య పరీక్షలు, శరీర నిర్మాణ శాస్త్ర అధ్యయనం కోసం ప్రతి ఏటా 15 మృతదేహాలు అవసరమవుతాయని వారు పేర్కొన్నారు.
ఈ విషయాన్ని గుర్తించి ప్రజలు అవయవ, మృతదేహ దానానికి ముందుకు రావాలని లయన్స్ క్లబ్ సభ్యులు కోరారు. దాతల కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు, ఏర్పాట్లను లయన్స్ క్లబ్ సభ్యులు అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు పాల్గొన్నారు.