భారత్ సమాచార్, మెదక్ జిల్లా: గొర్రెలను కడిగేందుకు కుంటలోకి దిగిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందిన విషాద ఘటన నార్సింగి మండల పరిధిలో చోటుచేసుకుంది. మండలంలోని పెద్ద తండాకు చెందిన మాలోత్ నవీన్ (22), తండ్రి సీత్య, పెయింటర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కుటుంబ సభ్యులు తండాలోని ఇతరుల గొర్రెలను కూలికి మేపుతూ జీవనం కొనసాగిస్తున్నారు.
ఈ క్రమంలో మంగళవారం నవీన్ గొర్రెలను మేపుకుంటూ మధ్యాహ్న సమయంలో ఖాసులాపూర్ పరిధిలోని లింగారెడ్డి కుంట వద్దకు చేరుకున్నాడు. గొర్రెలను కుంటలో కడిగే క్రమంలో ప్రమాదవశాత్తు నవీన్ నీటిలో జారిపడి మునిగిపోయాడు. కొద్దిసేపటి తర్వాత నీటిలో గల్లంతైన నవీన్‌ను బయటకు తీసేందుకు స్థానికులు ప్రయత్నించినప్పటికీ అప్పటికే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని నీటిలో నుంచి బయటకు తీసి పంచనామ నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు.
నవీన్ మృతితో పెద్ద తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు స్థానికులను కలచివేశాయి. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఏఎస్ఐ ఖాజా మిస్బాహ్ ఉద్దీన్ తెలిపారు.