భారత్ సమాచార్, మెదక్ జిల్లా: సమాజంలో మార్పు రావాలంటే ముందుగా ప్రతి ఒక్కరూ తమలో తాము మార్పు తీసుకురావాలని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల అన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ డ్రగ్స్, మాదకద్రవ్యాలు, నషాకు అలవాటు పడబోమని ప్రతి ఒక్కరూ సంకల్పం చేయాలని పిలుపునిచ్చారు. నశాముక్త మెదక్ దిశగా ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
మంగళవారం మెదక్ ఐడీఓసీలో నిర్వహించిన నశాముక్త భారత్ కార్యక్రమంలో గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల పాల్గొన్నారు. ఈ సందర్భంగా నశాముక్తి ర్యాలీని పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని నశాముక్తంగా మార్చేందుకు చేపట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో యువత కీలక పాత్ర పోషించాలని గవర్నర్ సూచించారు.
భారత్ ప్రపంచంలోనే అత్యంత యువ దేశాల్లో ఒకటని, యువశక్తి నషా బారిన పడితే దేశ అభివృద్ధికి తీవ్ర నష్టం కలుగుతుందని పేర్కొన్నారు. యువత తమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. ‘జీవితానికి అవును.. నషాకు నో’ అన్న సందేశాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ నిర్మూలనలో తెలంగాణ పోలీసులకు దేశంలో తొలి ట్రోఫీ రావడం అభినందనీయమని గవర్నర్ పేర్కొన్నారు.
టీబీ నిర్మూలనకు కృషి చేయాలి
నశాముక్త భారత్‌తో పాటు టీబీ ముక్త భారత్ లక్ష్య సాధనకు కూడా సమష్టిగా కృషి చేయాలని గవర్నర్ అన్నారు. టీబీ పూర్తిగా నయం చేయగల వ్యాధేనని, ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వైద్యుల సూచనల మేరకు మందులను క్రమం తప్పకుండా తీసుకుంటే టీబీ నుంచి పూర్తిగా కోలుకోవచ్చని చెప్పారు. నశాముక్తి, టీబీ నిర్మూలనపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
ఇంటి నుంచే ఉద్యమం ప్రారంభం కావాలి
నశాముక్తి ఉద్యమం ఇంటి నుంచే ప్రారంభం కావాలని గవర్నర్ పిలుపునిచ్చారు. కుటుంబం నుంచి పాఠశాల, గ్రామం, మండలం, జిల్లా స్థాయికి అవగాహన విస్తరించాలని సూచించారు. పాఠశాలల్లో విద్యార్థులు ఎవరైనా నషాకు సంబంధించిన కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు గుర్తిస్తే మౌనంగా ఉండకుండా ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల దృష్టికి తీసుకురావాలని అన్నారు.
నశాముక్తి ఒక్కరి బాధ్యత కాదని, “ఇది మనందరి బాధ్యత” అని గవర్నర్ స్పష్టం చేశారు. అధికారులు, పోలీసులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజలు సమష్టిగా కృషి చేసినప్పుడే మెదక్‌ను నశాముక్త జిల్లాగా తీర్చిదిద్దగలమని అన్నారు.