భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

6, అక్టోబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

జనావాసాల మధ్య రా రైస్ మిల్ వద్దంటూ ఆందోళన

జనావాసాల మధ్య రా రైస్ మిల్ వద్దంటూ ఆందోళన

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలం చిన్ననాగారం గ్రామంలో జనావాసాల మధ్య రా రైస్ మిల్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వవద్దని కోరుతూ గిరిజన మహిళలు, గ్రామస్తులు మంగళవారం రోడ్డెక్కారు. మూతబడిన చిన్న ఆయిల్ మిల్లు స్థానంలో సీఎంఆర్ కోసం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని వడ్లు కొనుగోలు చేసి బియ్యం వ్యాపారం చేసేందుకు భారీ రా రైస్ మిల్ ఏర్పాటు చేస్తున్నారని, ఆ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

మిల్లు నిర్మాణం చేపడుతున్న ప్రాంతం చుట్టుపక్కల నివసిస్తున్న గిరిజనులతో పాటు గ్రామస్తులు కేసముద్రం–తొర్రూరు ప్రధాన రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. దీంతో రహదారిపై వాహనాల రాకపోకలకు, ప్రయాణికులకు కొంతసేపు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న ఎస్సై ఆధ్వర్యంలోని పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు.

ఇండ్ల మధ్య రా రైస్ మిల్ దారుణం

చాలా సంవత్సరాల క్రితం చిన్న ఆయిల్, బియ్యం గిర్ని అక్కడ ఉండేదని, అది మూతపడి పదేళ్లకు పైగా కావడంతో ఆ ప్రాంతంలో తాము ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్నామని గిరిజన మహిళలు గుగులోతు నీలమ్మ, జానీతో పాటు మాదగాని ఉప్పలయ్య తదితరులు తెలిపారు. ఇప్పుడు తిరిగి అదే ప్రాంతంలో రా రైస్ మిల్ ఏర్పాటు చేసేందుకు భారీ నిర్మాణం చేపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

జనావాసాల మధ్య రా రైస్ మిల్ వద్దంటూ ఆందోళన

జనావాసాల మధ్య రా రైస్ మిల్ ఏర్పాటుతో వాతావరణ, ధ్వని కాలుష్యంతో పాటు దుమ్ము, ఊక, తౌడు వ్యాపించి ప్రజారోగ్యంపై ప్రభావం పడే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. రా రైస్ మిల్ ఏర్పాటైతే ఇతర ప్రాంతాల నుంచి వచ్చే కార్మికుల వల్ల కూడా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు.

అయితే సమస్య తీవ్రతను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని పోలీసులు హామీ ఇచ్చారు. ప్రధాన రహదారిపై ఆందోళన చేయడం వల్ల ప్రయాణికులకు, వాహనదారులకు ఇబ్బందులు కలుగుతున్నందున నిరసన విరమించాలని పోలీసులు నచ్చజెప్పారు. దీంతో ఆందోళనకారులు అక్కడి నుంచి గ్రామపంచాయతీ వైపు తరలివెళ్లారు.

గ్రామపంచాయతీ ముట్టడి

రా రైస్ మిల్ ఏర్పాటు చేస్తున్న ప్రాంతానికి సమీపంలో నివాస గృహాలు ఉన్నందున నిర్మాణానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు ఇవ్వవద్దని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు, గిరిజనులు చిన్ననాగారం గ్రామపంచాయతీని ముట్టడించి నిరసన తెలిపారు. గ్రామస్తుల ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత గ్రామపంచాయతీ పాలకులతో పాటు ప్రభుత్వంపైనా ఉందని అన్నారు.

జనావాసాల మధ్య భారీ రా రైస్ మిల్ నిర్మాణానికి గ్రామపంచాయతీతో పాటు సంబంధిత శాఖలు ఎలాంటి అనుమతులు ఇవ్వవద్దని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. అనుమతులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఈ విషయంపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో రా రైస్ మిల్ నిర్మాణ ప్రాంతానికి చెందిన గిరిజనులు, గ్రామస్తులు పాల్గొన్నారు.