భారత్ సమాచార్, మెదక్ జిల్లా: చిన్నశంకరంపేట మండల పరిధిలోని దరిపల్లి గ్రామంలో గొర్రెల మందపై గుర్తుతెలియని కుక్కలు దాడి చేయడంతో ఐదు గొర్రెలు మృతి చెందిన ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జంగం బాలయ్య తన గొర్రెలను పాకలో ఉంచగా, రాత్రి సమయంలో కుక్కలు మందపై దాడి చేశాయి.
కుక్కల దాడిలో ఐదు గొర్రెలు మృతి చెందడంతో బాధిత కుటుంబానికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఎంతోకాలంగా గొర్రెల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్న తనకు ఈ ఘటనతో ఆర్థికంగా తీవ్ర నష్టం జరిగిందని బాధితుడు జంగం బాలయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
కుక్కల సంచారంతో భయాందోళన
గ్రామంలో కుక్కలు విచ్చలవిడిగా సంచరిస్తుండటంతో ప్రజలు, పశువుల యజమానులు భయాందోళనకు గురవుతున్నారని గ్రామస్థులు తెలిపారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో కుక్కల బెడద ఎక్కువగా ఉందని, పశువులను కాపాడుకోవడం ఇబ్బందిగా మారిందని పేర్కొన్నారు.
అధికారులు వెంటనే స్పందించి గ్రామంలో విచ్చలవిడిగా సంచరిస్తున్న కుక్కలను బంధించి ఇతర ప్రాంతాలకు తరలించాలని గ్రామస్థులు కోరారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కుక్కల దాడిలో ఐదు గొర్రెలను కోల్పోయిన తనను ప్రభుత్వం ఆదుకుని నష్టపరిహారం అందించాలని బాధితుడు జంగం బాలయ్య డిమాండ్ చేశారు.