భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: వ్యవసాయ క్షేత్రాల్లో ఏర్పాటు చేసుకునే నీటి కుంటలు (ఫామ్ పాండ్) రైతులకు బహుళ ప్రయోజనాలను అందిస్తాయని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జెడ్పీ సీఈవో పురుషోత్తం అన్నారు. మంగళవారం మండలంలోని శ్రీరామగిరి గ్రామంలో రైతులకు చెందిన నీటి కుంటను ఎంపీడీవో సింగారపు కుమార్‌తో కలిసి అదనపు కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఫామ్ పాండ్ నిర్మించుకున్న రైతుతో పాటు వీబీజీ రాంజీ కూలీలు, సిబ్బందితో నీటి కుంట నిర్మాణం ప్రాముఖ్యత, దాని వల్ల కలిగే ప్రయోజనాలపై అదనపు కలెక్టర్ ఆరా తీశారు. వ్యవసాయ భూముల్లో నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవడం వల్ల వర్షపు నీటిని నిల్వ చేసుకోవడంతో పాటు భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుందని తెలిపారు.
వేసవి కాలంలో సైతం నీటి లభ్యతతో పంటలు సాగు చేసుకునేందుకు ఫామ్ పాండ్‌లు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. పశువులకు నీటి కొరతను తీర్చడంతో పాటు ఉద్యానవన పంటల సాగుకు కూడా ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. ఎల్‌నినో వంటి పరిస్థితుల్లో నీటి లభ్యత తగ్గినప్పుడు నీటి కుంటలు రైతులకు మరింత ప్రయోజనం చేకూరుస్తాయని అదనపు కలెక్టర్ తెలిపారు.
రైతులు ఫామ్ పాండ్‌లను సద్వినియోగం చేసుకుని నీటి వనరులను సంరక్షించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మాదరి ప్రశాంత్, ఉపసర్పంచ్ సుమన్, వీబీజీ రాంజీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.