భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

7, అక్టోబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

చందంపేటలో రూ.5 లక్షల పనులకు శ్రీకారం

5 లక్షలతో మురుగు కాలువల నిర్మాణం ప్రారంభం..   పనులను ప్రారంభించిన సర్పంచ్ ప్రవీణ్ కుమార్..

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: చిన్నశంకరంపేట మండలంలోని చందంపేట గ్రామ అభివృద్ధిలో భాగంగా మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు సర్పంచ్ నాయిని ప్రవీణ్‌కుమార్ తెలిపారు. గ్రామంలోని 9వ వార్డులో రూ.5 లక్షల గ్రామపంచాయతీ నిధులతో చేపట్టనున్న మురుగు కాలువల నిర్మాణ పనులను బుధవారం సర్పంచ్ నాయిని ప్రవీణ్‌కుమార్, పాలకవర్గ సభ్యులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలో పారిశుధ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా మురుగు కాలువల నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు.

గ్రామపంచాయతీ నిధులను ప్రజల అవసరాలకు అనుగుణంగా వినియోగిస్తూ చందంపేటను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని సర్పంచ్ తెలిపారు. గ్రామంలో అవసరమైన పనులను గుర్తించి దశలవారీగా పూర్తి చేస్తూ ప్రజలకు మెరుగైన వసతులు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

మురుగు కాలువల నిర్మాణంతో వర్షాకాలంలో మురుగు నీటి సమస్య తగ్గడంతో పాటు గ్రామంలో పారిశుధ్యం మెరుగుపడుతుందని గ్రామస్తులు తెలిపారు. అభివృద్ధి పనులను నాణ్యతతో, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సర్పంచ్ సూచించారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సంతోష్‌కుమార్, ఉపసర్పంచ్ నర్సింలు, పాలకవర్గ సభ్యులు నర్సింలు, నరేష్, స్వామి, భూపాల్, గ్రామస్తులు దుర్గ, సంగయ్య, స్వామి, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.