భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి జిల్లా: డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం. రవి సూచించారు. బుధవారం వలిగొండ పట్టణంలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించే వాల్ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా CI రవి మాట్లాడుతూ.. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని సూచించారు. బ్యాంకు అధికారులమంటూ ఫోన్ చేసి OTP, ATM కార్డు, బ్యాంకు ఖాతా తదితర వివరాలు అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించవద్దని తెలిపారు.
ఆన్‌లైన్‌లో డబ్బులు పంపే ముందు అవతలి వ్యక్తి వివరాలను ఒకటికి రెండుసార్లు పరిశీలించుకోవాలని సూచించారు. ఉచిత బహుమతులు, లాటరీలు వచ్చాయని, భారీ మొత్తంలో నగదు గెలుచుకున్నారని వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలను నమ్మి వ్యక్తిగత లేదా బ్యాంకు వివరాలను వెల్లడించవద్దని చెప్పారు. అనుమానం కలిగించే లావాదేవీలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు.
ఎవరైనా సైబర్ నేరానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలని లేదా సమీప పోలీస్‌స్టేషన్‌ను సంప్రదించాలని CI రవి కోరారు. సైబర్ మోసాలపై వేగంగా ఫిర్యాదు చేయడం ద్వారా నష్టాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో SI ఎం. శ్రీకాంత్‌రెడ్డి, పోలీసు సిబ్బంది, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.