భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

7, అక్టోబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

రామాయంపేటలో కరెంట్ కోతలపై రైతుల ఆగ్రహం

రామాయంపేటలో కరెంట్ కోతలపై రైతుల ఆగ్రహం

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేట సబ్‌స్టేషన్ పరిధిలో కొనసాగుతున్న తీవ్ర విద్యుత్ కోతలు, లో-వోల్టేజ్ సమస్యతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగి రాములు తెలిపారు. రైతుల పంటలను కాపాడేందుకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ అధికారులను డిమాండ్ చేశారు.

ప్రస్తుతం రైతులు సాగు చేసిన పంటలు తుది దశకు చేరుకున్నాయని, మరో 20 రోజులు పంటలకు నిరంతరంగా నీరు అందితే పంటలు చేతికొచ్చే అవకాశం ఉందని తెలిపారు. అయితే రామాయంపేట సబ్‌స్టేషన్ పరిధిలో తరచూ విద్యుత్ కోతలు విధించడం, లో-వోల్టేజ్ సమస్యలు తలెత్తడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

గంట, రెండు గంటలకు ఒకసారి, కొన్ని సందర్భాల్లో అరగంటకే విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. ముఖ్యంగా లో-వోల్టేజ్ కారణంగా వ్యవసాయ మోటార్లు కాలిపోయే ప్రమాదం కూడా ఉందని తెలిపారు.

రామాయంపేటలో కరెంట్ కోతలపై రైతుల ఆగ్రహం

ఈ సమస్యపై ఇప్పటికే మెదక్ MP మాధవనేని రఘునందన్ రావు విద్యుత్ శాఖ ఎస్సీని ఫోన్ ద్వారా సంప్రదించి సమస్యను పరిష్కరించాలని కోరారని రాగి రాములు తెలిపారు. అలాగే స్థానిక సబ్‌స్టేషన్ AE తిరుపతిరెడ్డిని కూడా ఫోన్ ద్వారా సంప్రదించి రైతులకు విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని కోరినట్లు చెప్పారు.

ఈ నేపథ్యంలో బుధవారం రైతులతో కలిసి రామాయంపేట సబ్‌స్టేషన్‌ను సందర్శించి, స్థానిక AE తిరుపతిరెడ్డిని కలిసి సమస్యను వివరించారు. సబ్‌స్టేషన్‌లోని లాగ్‌బుక్‌ను పరిశీలించగా.. 12 వోల్టేజ్ స్థాయిలో ఉండాల్సిన చోట 9.9గా నమోదైన పరిస్థితి కనిపించిందని తెలిపారు. దీనివల్ల వ్యవసాయ మోటార్లు సక్రమంగా పనిచేయకపోవడంతో పాటు కాలిపోయే ప్రమాదం ఉందని AE దృష్టికి తీసుకెళ్లారు.

రైతుల పంటలు చేతికొచ్చే ఈ కీలక సమయంలో ఎలాంటి విద్యుత్ కోతలు లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని, లో-వోల్టేజ్ సమస్యను తక్షణమే పరిష్కరించాలని రాగి రాములు విద్యుత్ అధికారులను డిమాండ్ చేశారు. సమస్యను ఒకటి రెండు రోజుల్లో అధిగమించేలా చర్యలు తీసుకుంటామని AE తిరుపతిరెడ్డి హామీ ఇచ్చారని తెలిపారు.

రామాయంపేటలో కరెంట్ కోతలపై రైతుల ఆగ్రహం

అయితే ఇచ్చిన హామీ మేరకు సమస్య పరిష్కారం కాకుండా ఇదే పరిస్థితి కొనసాగితే.. రైతుల పక్షాన బీజేపీ ఆధ్వర్యంలో రామాయంపేట సబ్‌స్టేషన్ వద్ద నిరసన చేపట్టాల్సి వస్తుందని రాగి రాములు హెచ్చరించారు.

రైతులకు పంటలు చేతికొచ్చే చివరి 20 రోజులు అత్యంత కీలకమని, ఈ సమయంలో విద్యుత్ కోతల వల్ల ఒక్క రైతు కూడా నష్టపోకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుల పంటలకు నష్టం జరిగితే బీజేపీ రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని రాగి రాములు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో అక్కన్నపేట గ్రామ సర్పంచ్ బక్కయ్య, యాదగిరి, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మెంగర్తి రంగయ్య, కిసాన్ మోర్చా నాయకులు రాగి అనిల్ కుమార్, సున్నం యాదగిరి తదితరులు పాల్గొన్నారు.