భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బొడ్డెమ్మ పండుగ సందర్భంగా ఇనుగుర్తి మండలం చిన్ననాగారం గ్రామానికి చెందిన స్వర్గీయ మాజీ సర్పంచ్ బైరు సోమయ్య సతీమణి బైరు వెంకటమ్మ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. బొడ్డెమ్మ ఉత్సవాల్లో పాల్గొంటున్న మహిళలకు చీరలను వితరణ చేసి పండుగ వేడుకల్లో ప్రత్యేకంగా నిలిచారు.
గ్రామంలోని శ్రీ ముత్యాలమ్మ దేవస్థానం కళావేదిక వద్ద నిర్వహిస్తున్న బొడ్డెమ్మ ఉత్సవాల్లో పాల్గొంటున్న సుమారు 20 మంది మహిళలకు రూ.10 వేల విలువైన చీరలను బుధవారం వెంకటమ్మ అందజేశారు. ఆమె కోడళ్లు బైరు యాక లక్ష్మి, వెంకటలక్ష్మి, జమున, రజితల చేతుల మీదుగా మహిళలకు చీరలను పంపిణీ చేశారు.
సంస్కృతిని ప్రోత్సహించేందుకే..
ఈ సందర్భంగా వెంకటమ్మ కోడళ్లు మాట్లాడుతూ.. అనాదిగా వస్తున్న బొడ్డెమ్మ సంస్కృతిని మరింత ఉత్సాహంగా కొనసాగిస్తూ పండుగను జరుపుకోవడానికి మహిళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తమ అత్తమ్మ వెంకటమ్మ చీరలను అందజేసినట్లు చెప్పారు. బొడ్డెమ్మ వేడుకల్లో పాల్గొంటున్న మహిళలకు చీరలను అందజేయడం సంతోషంగా ఉందన్నారు.
కార్యక్రమంలో బొడ్డెమ్మ వేడుకల్లో పాల్గొంటున్న మహిళలు తదితరులు పాల్గొన్నారు.