భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

7, అక్టోబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

సొంతూళ్లకు వెళ్లే వారికి బిగ్ అప్‌డేట్

సొంతూళ్లకు వెళ్లే వారికి బిగ్ అప్‌డేట్

భారత్ సమాచార్, తెలంగాణ: దసరా పండుగ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. దసరా రద్దీని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా 7 వేల ప్రత్యేక బస్సులను నడపాలని యాజమాన్యం నిర్ణయించింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు.

కరీంనగర్ జోన్‌లో 3,533 ప్రత్యేక బస్సులు

కరీంనగర్ జోన్ పరిధిలో మొత్తం 3,533 ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. రీజియన్ల వారీగా ఆదిలాబాద్ నుంచి 431, నిజామాబాద్ నుంచి 719, కరీంనగర్ నుంచి 1,175, వరంగల్ నుంచి 530, ఖమ్మం నుంచి 678 బస్సులను నడపనున్నారు. హైదరాబాద్ జోన్ నుంచి మొత్తం 2,155 ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. ఇందులో మహబూబ్‌నగర్ 645, మెదక్ 255, నల్గొండ 815, రంగారెడ్డి 440 బస్సులు ఉన్నాయి.

అలాగే గ్రేటర్ హైదరాబాద్ జోన్ నుంచి దసరా పండుగ సందర్భంగా 1,312 ప్రత్యేక సర్వీసులను నడపాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఈ నెల 9, 10, 16, 17 తేదీల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ఆయా రోజుల్లో రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులను అందుబాటులో ఉంచనున్నారు. ఈ నెల 25, 26 తేదీల్లో ఉండే తిరుగు ప్రయాణ రద్దీని దృష్టిలో పెట్టుకుని కూడా సంస్థ తగిన ఏర్పాట్లు చేసింది.

హైదరాబాద్‌లో ప్రత్యేక ఏర్పాట్లు

హైదరాబాద్‌లో రద్దీ ఎక్కువగా ఉండే MGBS, JBS, ఉప్పల్ (నల్ల చెరువు), ఆరాంఘర్, LB నగర్ క్రాస్ రోడ్స్, KPHB, బోయిన్పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడపనున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఆయా ప్రాంతాల్లో పండల్స్, షామియానాలు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, తాగునీటి సదుపాయం, మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేయనున్నారు.

రద్దీకి అనుగుణంగా బస్సుల తరలింపు

ప్రధాన పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో ప్రజలకు రవాణా పరంగా ఇబ్బందులు తలెత్తకుండా వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. తిరుగు ప్రయాణంలో కొన్ని ప్రత్యేక బస్సుల్లో ప్రయాణికుల రద్దీ లేకపోయినా, రద్దీ ఉన్న రూట్లలో ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఖాళీ బస్సులను త్వరితగతిన వెనక్కి తీసుకువచ్చి అవసరమైన రూట్లలో నడపనున్నారు.

ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులను వివిధ రూట్లకు తరలించనున్నారు. ప్రత్యేక బస్సులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చులు, నిర్వహణ వ్యయాలను దృష్టిలో పెట్టుకుని టికెట్ ధరలను సవరించుకునేందుకు 2003లో రాష్ట్ర ప్రభుత్వం GO నంబర్ 16ను జారీ చేసింది. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో నడిచే ప్రత్యేక బస్సులకు మాత్రమే 1.5 వరకు టికెట్ ధరలను సవరించుకునే వెసులుబాటును సంస్థకు కల్పించింది.

రాష్ట్ర ప్రభుత్వ GO ప్రకారం ప్రధాన పండుగల సమయంలో 1.5 వరకు టికెట్ ధరలను ఉమ్మడి కార్పొరేషన్‌గా ఉన్నప్పటి నుంచి అమలు చేస్తున్నట్లు టీజీఎస్ఆర్టీసీ తెలిపింది. టీజీఎస్ఆర్టీసీ ఏర్పడిన తర్వాత కూడా ప్రతి ప్రధాన పండుగకు ఈ విధానాన్ని కొనసాగిస్తోంది.

స్పెషల్ బస్సులకు మాత్రమే సవరించిన ఛార్జీలు

ఈ దసరా పండుగ సందర్భంగా నడిపే ప్రత్యేక బస్సులకు రాష్ట్ర ప్రభుత్వ GO ప్రకారం 1.5 వరకు టికెట్ ధరలను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం సవరించింది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు నడిచే స్పెషల్ బస్సులకు మాత్రమే ఈ సవరించిన ఛార్జీలు వర్తిస్తాయి.

ఈ నెల 9, 10, 16, 17 తేదీలతో పాటు తిరుగు ప్రయాణ రద్దీ ఎక్కువగా ఉండే 25, 26 తేదీల్లో మాత్రమే సవరించిన ఛార్జీలు అమల్లో ఉంటాయని సంస్థ స్పష్టం చేసింది. స్పెషల్ బస్సులు మినహా రెగ్యులర్ బస్సుల్లో సాధారణ టికెట్ ఛార్జీలే అమల్లో ఉంటాయని తెలిపింది.

మహిళలకు ఉచిత ప్రయాణం యథావిధి

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంలో భాగంగా దసరా సందర్భంగా నడిపే పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరి, మెట్రో ఎక్స్‌ప్రెస్ రెగ్యులర్, స్పెషల్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం యథావిధిగా కొనసాగుతుందని టీజీఎస్ఆర్టీసీ MD వై. నాగిరెడ్డి స్పష్టం చేశారు.

ముందస్తు రిజర్వేషన్ చేసుకోండి

దసరా ప్రయాణాలను దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులు టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకోవాలని యాజమాన్యం సూచించింది. ఇందుకోసం www.tgsrtcbus.in వెబ్‌సైట్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చని తెలిపింది.