భారత్ సమాచార్, స్పోర్ట్స్: ఆస్ట్రేలియాపై భారత్ U-19 జట్టు అదిరిపోయే విజయాన్ని అందుకుంది. రెండు మ్యాచ్‌ల యూత్ టెస్ట్ సిరీస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. అహ్మదాబాద్‌లో జరిగిన రెండో యూత్ టెస్ట్‌లో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. ఈ విజయానికి భారత స్పిన్నర్ తన్మయ్ బలోడా ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
చివరి నిమిషంలో రోహిత్ యాదవ్ స్థానంలో జట్టులోకి వచ్చిన తన్మయ్.. తనకు వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. బంతితో ఆస్ట్రేలియా బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టిన అతడు రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఏకంగా 14 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీసిన తన్మయ్.. రెండో ఇన్నింగ్స్‌లో మరింత విజృంభించి 8 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
టిమ్ సౌథీ రికార్డ్ బద్దలు
తన్మయ్ బలోడా ప్రదర్శనతో యూత్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా తన్మయ్ నిలిచాడు. గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్ స్టార్ టిమ్ సౌథీ పేరిట ఉండేది.
2007లో భారత్ U-19తో జరిగిన మ్యాచ్‌లో టిమ్ సౌథీ రెండు ఇన్నింగ్స్‌ల్లో 92 పరుగులు ఇచ్చి 12 వికెట్లు పడగొట్టాడు. తాజాగా తన్మయ్ బలోడా కేవలం 73 పరుగులు ఇచ్చి 14 వికెట్లు సాధించి.. సౌథీ 19 ఏళ్లుగా కొనసాగుతున్న రికార్డును బద్దలు కొట్టాడు.
ఆస్ట్రేలియా బ్యాటర్లకు షాక్
రెండో యూత్ టెస్ట్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో 174 పరుగులకు ఆలౌట్ అయిన కంగారూ జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లో కూడా 151 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్ ముందు కేవలం 11 పరుగుల స్వల్ప లక్ష్యం మాత్రమే నిలిచింది.
చిన్న లక్ష్యాన్ని భారత బ్యాటర్లు ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఛేదించారు. తొలి ఓవర్‌లోనే రెండు బౌండరీలు బాదిన టీమిండియా ఓపెనర్లు వికెట్ కోల్పోకుండానే విజయాన్ని అందుకున్నారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 315 పరుగుల భారీ స్కోర్ సాధించింది. మొత్తంగా తన్మయ్ బలోడా స్పిన్ మ్యాజిక్‌కు తోడుగా భారత జట్టు సమష్టి ప్రదర్శనతో సిరీస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేసింది.